Vasthu Shastra | క్లాస్ రూములో పిల్లలు తూర్పు దిక్కు చూడాలా? పడమర వైపు చూడమంటారా? మాది పడమర రోడ్డు. ప్రహరీ లేదు.
– ఎం. రుక్మిణి, పెబ్బేరు
రోడ్డు ఏ దిశకు ఉన్నా తరగతి గదులకు మంచి గాలీ వెలుతురు వచ్చేలా పాఠశాలకు దూరంగా కాంపౌండ్ కట్టాలి. ప్రహరీ లేకుండా, చెట్లు లేకుండా పాఠశాల ప్రాంగణం ఉండకూడదు. తరగతి గదులు తూర్పు-పడమరలుగా పొడవు ఉండి.. పిల్లలు తూర్పు దిక్కుగా చూసేలా తరగతి గదుల అమరిక ఉండాలి. ఉపాధ్యాయుడు పడమర ముఖంగా ఉండి, పాఠాలు చెప్పే ఏర్పాటు చేసుకోవాలి. అయితే దీనితోనే సరిపోదు. తరగతి గదులకు తూర్పుగా.. ఉత్తరంగా.. వరండాను కనీసం ఏడు అడుగులు తగ్గకుండా నిర్మాణం చేయాలి. అప్పుడే ముఖం ఎండ ఉండదు. తూర్పు ముఖం ప్రజ్ఞను పెంచుతుంది. త
రగతి గదిలో టీచర్ కోసం స్టేజ్ ప్లాట్‌ఫామ్ నిర్మిస్తే.. తప్పక ఆ గదులకు పడమర సెల్ఫ్‌లు పెట్టి.. పిల్లల టిఫిన్ బాక్సులు, తదితర క్లాస్ వస్తువులు పెట్టుకునే ఏర్పాటు చేసుకోవాలి.
ఈశాన్యం ఇంటికి ఉత్తరం మెయిన్ డోర్ పెట్టాలా? లేదంటే, తూర్పు వైపు పెట్టాలా? ఇల్లు ఈశాన్యం కొంత తిప్పి కట్టాము.
– కె. సుభద్ర, మొరిపిరాల
ఈశాన్యం ఇల్లు అనగానే కొందరు ఏదో నిధి దొరికినంత సంతోషిస్తారు. అది మంచి భాగమే కావచ్చు. కానీ, దానికీ దోషాలు ఉండే అవకాశం ఉంది. ‘డాక్టర్‌కు రోగాలు రావు’ అనలేం కదా! ఈశాన్యం బ్లాకు ఇంటికి తప్పకుండా ఉత్తరం, తూర్పునకు సింహద్వారాలు పెట్టాలి. ఏదో ఒకటి పెడితే పెద్ద దోషం వస్తుంది. గేట్లు కూడా రెండు దిశలకు పెట్టాల్సిందే! అప్పుడే ఆ దిశల ఉత్తమ ఫలితం పొందగలుగుతాం. ఇల్లు తిప్పి కట్టామని అన్నారు. అది చాలా పెద్ద తప్పు. దిశకు ఇల్లు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఈశాన్యం దిక్కుకు ఇల్లు తిప్పి కట్టవద్దు. తద్వారా గృహావరణం ఈశాన్యం తగ్గి, తూర్పు – ఆగ్నేయం పెరుగుతుంది. ఇంటి నిర్మాణంలో ఈశాన్యం పెంచినా, తెంపు చేసినా ఈశాన్యం దోషం వస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోక చాలామంది మేస్త్రీలు, యజమానులు ఇంటి ఈశాన్యంలో తప్పులు చేస్తున్నారు. వెంటనే సవరించుకోండి.
మాకు తూర్పు సరిగ్గా ఉంది కానీ, ఈశాన్యం మూల స్లాబ్ పొడవు పెంచారు. అది మంచిదేనా? ఆ ఇంట్లో ఉండొచ్చా?
– ఎం. దానయ్య, కొత్తూరు
తూర్పు ఈశాన్యం పెంచి కట్టాలి. నైరుతి తెంపుచేసి కట్టాలి.. అనే ఆలోచనలు ఎందుకో జనంలోకి దూరిపోయాయి. కానీ, చాలా తప్పు. ఇల్లు కోణంగా ఈశాన్యం పెంచి కడితే ఇంటి లోపలి కొలతలు చాలా వ్యత్యాసంతో ఉంటాయి. నైరుతి ఈశాన్యాలు పెరిగి, ఆగ్నేయం – వాయవ్యం కొలతలు తగ్గుతాయి. అప్పుడు ఇంటి అంతఃకరణమే దెబ్బతింటుంది. ఇలా కోణంగా పెరిగిన ఇండ్లల్లో దీర్ఘ రోగులు మంచానపడి, చూసేవాళ్లు లేక నివాసం చేయాల్సి వస్తుంది. మీరు ఆ ఇంట్లో ఉండదలిస్తే.. వెంటనే సవరించుకోండి. అద్దె ఇల్లు అయితే ఖాళీ చేయండి. దిశలు సరిగ్గా ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు కూడా సరిగ్గా ఉండాలి కదా! మంచి కూరగాయలు తెస్తే కాదు.. మంచిగా వంట చేయాలి కదా! ఇంటి విషయంలో అశ్రద్ధ వద్దు.
మాది గవర్నమెంట్ క్వార్టర్. దక్షిణభాగం.. ఉత్తరం కన్నా ఎక్కువ ఖాళీ ఉంది. కాకపోతే, ఎత్తుగా ఉంది. మంచిదేనా?
– కె. చంద్రశేఖర్, కర్మన్‌ఘాట్
ఇంటికి ఖాళీ భాగం శాస్త్ర పద్ధతిలోనే ఉండాలి. ఇంటి చుట్టూ ప్రదక్షిణంగా ఖాళీ ఉంటూ ఉత్తరం కన్నా దక్షిణం తక్కువ, తూర్పు కన్నా పడమర తక్కువ అనేది ముందు సూత్రం. ఎత్తులు అనేవి విశాలత్వానికి సంబంధించినవి కాదు. ఆ ఎత్తు పల్లాల లెక్కవేరు. దక్షిణం ఎత్తు ఉంది కాబట్టి ఎక్కువ ఖాళీగా ఉన్నా తప్పులేదని అనుకోవద్దు. ఆ ఇంటి వయసును బట్టి దక్షిణం అధిక ఖాళీ ప్రభావం స్త్రీల మీద అంటే.. ఇంటి యజమానురాలి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఆమెను త్వరితగతిన ఇల్లు దాటించే పెద్ద నష్టం తెస్తుంది. ముందు మీరు ఆ ఇల్లు దక్షిణమే కాకుండా.. మిగతా దోషాలను కూడా చూసుకొని పూరించండి. లేదా ఇల్లు మారిపోండి. ఎత్తు కాదు ముఖ్యం. ఆ పెరిగిన భాగం తగ్గించి, కొత్త కాంపౌండు కట్టుకోండి.
Vasthu Shastra | మట్టి గోడలతో ఇల్లు కట్టొచ్చా? ఎన్ని గదులు వేయవచ్చు?