e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News పల్లె పాటల.. హృదయ స్పందన!

పల్లె పాటల.. హృదయ స్పందన!

బడికి వెళ్లే వయసు. అక్షరాలతో పాటు చరణాలు నేర్చుకున్నది. పద్యాలతో పాటు పల్లవులూ ఒంటబట్టించుకున్నది. చిన్న వయసులోనే ఉద్యమ గీతమై నినదించింది.పరిస్థితులు అడ్డుకున్నా..పాటల ప్రయాణాన్ని ఆపకుండా.. పల్లె పదాలతో సోపతి చేస్తున్న స్పందన పరాంకుశం పాటల ముచ్చట..

మాది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మగూడెం. అమ్మ పేరు శ్రీదేవి. నాన్న లక్ష్మణస్వామి టీచర్‌. ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకు ఏం కావాలో? వారిని ఎలా తీర్చిదిద్దాలో నాన్నకు బాగా తెలుసు. చాలామందికి నాన్న ఆదర్శం. జిన్నారం ప్రభుత్వ పాఠశాలలోనే మమ్మల్ని చదివించిండు. నాన్న సాహిత్యాభిలాషి. చదవడం, రాయడం, పాడటం ఆయన అభిరుచి. నాన్న వల్లే నేను పాటల ప్రపంచంలోకి వచ్చిన. పాటంటే ఏందో తెలియని వయసులో నాన్న పాడే జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలు ఆలోచింపజేసేవి. వారసత్వంగా వచ్చింది కాబట్టి, పాడటం తొందరగానే అబ్బింది. స్కూల్లో ఏ కాంపిటీషన్స్‌ జరిగినా ఫస్ట్‌ ప్రైజ్‌ నాకే. తక్కువ సమయంలోనే బయట కూడా పాడటం మొదలుపెట్టిన. నా పాట గురించి ఊర్లో అందరికీ తెలిసిపోయింది.

- Advertisement -

తలుపు తట్టిన అవకాశం
అప్పుడు నేను తొమ్మిదో తరగతి. ఎల్లన్న, మల్లేశన్న మా ఇంటికి వచ్చిండ్రు. వాళ్లు అప్పటికే జానపదాల్లో ఫేమస్‌. అభినందించడానికి వచ్చిండ్రేమో అనుకున్న. కానీ చాలాసేపు మాట్లాడిండ్రు. ‘మీ స్పందన బాగా పాడుతుంది. మేం కూడా చూసినం. మాకు ఒక టీమ్‌ ఉంది, పంపించండి’ అని అడిగిండ్రు. నాన్న ‘సరే’ అన్నరు. వాళ్ల బృందంలో చేరిన. వేదిక ఎక్కడైనా సరే, ఎగిరి దుంకి పాడే స్థాయికి చేరుకున్న. ‘పాటే లోకం కాదు కదా?’ అని నాన్న ఏ ముహూర్తాన అన్నరోగానీ నిజంగానే, ‘పాట ఒక కొత్త ప్రపంచం’గా మారింది. బడికి పోతూనే ప్రోగ్రామ్స్‌ చేసేదాన్ని. పెద్ద వేదిక మీద మధుప్రియక్క పాట ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనానీ’.. పాడిన. ‘చదువును నిర్లక్ష్యం చేస్తదా ఏంది?’ అని అమ్మానాన్నకు కొత్త భయం పట్టుకుంది. నాకవన్నీ చిన్నగా అనిపించినయి. పాటతో పోలిస్తే ప్రపంచంలో ఇంకేదీ పెద్ద విషయంగా
అనిపించలేదు.

ఉద్యమం గొంతుకనై..
తెలంగాణ ఉద్యమం మొదలైంది. రసమయన్న ఇచ్చిన పిలుపును అందుకొని మా బృందం ధూమ్‌ధామ్‌లలో భాగస్వామి అయ్యింది. అప్పుడు, నాకు పదమూడేండ్లు ఉంటయి. చిన్నపిల్లను కదా అవకాశమిస్తరో ఇయ్యరో అనుకున్న. కానీ, నాకు అవకాశం కల్పించిండ్రు. మొదటిసారి ‘గోదారి గోదారీ ఓహో పారేటి గోదారీ.. సుట్టూ నీళ్లు ఉన్న సుక్కా నీరు దొరకదు ఎడారి ఈ భూమీ’ అనే ఉద్యమగీతం పాడిన. స్పందన చూసి ఉత్సాహం రెట్టింపయింది. ‘ఇస్తననీ చెప్పుడేంది తెలంగాణ.. ఇగో అగో అనుడేంది తెలంగాణ’, ‘వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం’, ‘చెంచల్‌గూడ జైలులోన చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా’ వంటి పాటలెన్నో పాడిన. ప్రతీ వేదిక మీదా నాతో ‘త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా.. జగడమాడుతున్నమో విద్యార్థి వీరుల్లారా’ పాట పాడించేవాళ్లు.

సామాజిక గీతాలు దేశభక్తి గీతాలతో మొదలైన నా పాటల ప్రస్థానం ఉద్యమ గీతాల స్థాయికి చేరుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వచ్చింది. డిజిటల్‌ మీడియా వల్ల జానపదం ఊపందుకున్న క్రమంలో ఫోక్‌వైపు మళ్లిన. జానపదాలకు కూడా నా గొంతు బాగా కనెక్ట్‌ అయ్యింది. ‘కట్టకు కట్టకు బండీ.. కాడెడ్లా బండీ’, ‘బాయిల్లో బచ్చాలీ కూరా అంజన్నా’ వంటి జానపదాలు పాడిన. ఇప్పుడు జానపదం లేని ఈవెంట్‌ లేదు. సినిమాలూ లేవు. మాలాంటి వారికి జానపదం కొత్త జీవితాన్ని ఇస్తున్నది. మంచి అవకాశాల వైపు తీసుకెళ్తున్నది. త్వరలోనే పల్లెల్లో తిరిగి అచ్చమైన జానపదాలను సేకరించాలని అనుకుంటున్న. చాలామంది కళాకారులు డిజిటల్‌ మీడియా వైపు వెళ్లి సక్సెస్‌ అయ్యిర్రు. నేనూ చానెల్‌ పెట్టి జనంమెచ్చే జానపదాన్ని ప్రజల్లోకి తీసుకొస్త్త. సామాజిక అంశాలను పాటలుగా పాడాలన్నది నా కల. పల్లె పాటలే నా హృదయ స్పందనలుగా భావిస్త.

పాటను వదులుకోను
చదువుతో పాటు పాటలని అనుకున్న. పాటే నా ప్రపంచంగా మారింది. ఒకానొక దశలో చదువును డామినేట్‌ చేసింది. కానీ, పాట వల్ల నేను ఏనాడూ ఇబ్బంది పడలేదు. బయటివాళ్లు మాత్రం మాటలతో ఇబ్బంది పెట్టిండ్రు. మా సర్కిల్‌లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించినవాళ్లే ఉన్నరు. ఒకరిద్దరు సంగీతం నేర్చుకున్నా జానపద కళల్లో ఎవరూ లేరు. నాకేమో ఈ కళే ఇష్టం. దీంతో చుట్టాలు మమ్మల్ని తక్కువ చేస్తూ మాట్లాడేవాళ్లు. ‘పాటలు పాడటం, వేదికల మీద ఎగరడం మన ఇండ్లలో లేదు. ఇట్ల గంతులేస్తే నిన్నెవరూ చేసుకోరు. బాగుపడాలని అనుకుంటే పాటలు మానెయ్‌’ అని ఎన్నోసార్లు అన్నరు, ఇప్పటికీ అంటూనే ఉన్నరు. అది విన్న అమ్మానాన్న ‘చూడమ్మా! పరిస్థితులు చూస్తున్నవ్‌ కదా? ఆలోచించుకో’ అన్నరు. వేరే ఇంకేదైనా వదిలేస్తనేమోగానీ, పాటను మాత్రం వదులుకోను. పాటే నా ప్రాణం. పాటే నా ప్రపంచం.

మొదటిసారి ‘గోదారి గోదారీ ఓహో పారేటి గోదారీ.. సుట్టూ నీళ్లు ఉన్న సుక్కా నీరు దొరకదు ఎడారి ఈ భూమీ’ అనే ఉద్యమ గీతం పాడిన. స్పందన చూసి ఉత్సాహం రెట్టింపయింది. ‘ఇస్తననీ చెప్పుడేంది తెలంగాణ.. ఇగో అగో అనుడేంది తెలంగాణ’, ‘వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం’, ‘చెంచల్‌గూడ జైలులోన చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా’ వంటి పాటలెన్నో పాడిన.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement