జీవో 583 జారీ చేసినట్టు హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ సర్వీస్ క్యాడర్‌లోకి తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 14న జీవో 583 జారీచేసినట్టు వివరించింది. దీంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా విచారణకు హాజరుకావాలని క్యాట్ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఏ వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు కోర్టు ధికరణ, కేసు విచారణ కొనసాగింపునకు అడ్డంకి కాబోవని ప్రకటించింది.