Kharge : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని సోనార్పూర్ (Sonarpur) లో టీఎంసీ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (Abhisheik Baerjee) పై ఇవాళ (శనివారం) జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తప్పుపట్టారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ శనివారం సోనార్పూర్ వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు ఆయనపై కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయనకు తగినంత పోలీసు భద్రత లేకపోవడాన్ని బట్టి బీజేపీ రాజకీయాలు, ప్రతీకారాలను అర్థం చేసుకోవచ్చని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతిపక్ష నేతల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు. తాము ఎంతటి ద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలమని ఈ దాడితో బీజేపీ రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ కార్యకర్తలే అభిషేక్‌పై దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది.