హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ) : ‘16 ఏండ్ల యువ ఆవిష్కకర్త కన్న కలలతో ప్రారంభమైన ఒక పరిచయం.. నేడు అద్భుతమైన విజయంతో పరిపూర్ణమైంది’ అని యువ పారిశ్రామికవేత్త, ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆరవ్గార్గ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్‌కు ఆరవ్గార్గ్ అసాధారణ ప్రగతిని ప్రశసించారు. శుక్రవారం ఆయనతో జరిగిన సమావేశం వివరాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. 2022లో ఆయనను తొలిసారి కలిసినప్పటి రోజులను నెమరేసుకున్నారు. అప్ప ట్లో ఆ టీనేజర్ తాను రూపొందించిన ఒక ప్రొడక్ట్‌ను చూపించడమే గాకుండా, టెక్నాలజీ ద్వారా యువతను ఎలా సాధికారత వైపు నడిపించవచ్చో తన విజన్‌ను పంచుకున్నారని కేటీఆర్ తెలిపారు. నాలుగేండ్ల తర్వాత ఆరవ్.. ‘ఓమి’ అనే ప్రము ఖ ఏఐ వేరియబుల్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడిగా ఎదగడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. వినియోగదారులకు రెం డో మెదడులా పనిచేసేలా వారు రూపొందించిన పరికరాల ఏఐ స్టార్టప్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని, ప్రఖ్యా త అంతర్జాతీయ పత్రికలైన ది వాల్ స్ట్రీట్ జర్నల్, ఫోర్బ్స్లలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు.
టిమ్ డ్రేపర్, డ్రాప్ బాక్స్ వెంచర్స్ లాంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుంచి ఈ స్టార్టప్ సుమారు రూ.25 కోట్లు సేకరించిందని కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 25వేల కంటే ఎక్కువగా ఏఐ వేరియబుల్ పరికరాలు విక్రయించిందని తెలిపారు.
జనవరి 2022లో కేటీఆర్‌ను కలువ డం.. అప్పటి ఐటీ మంత్రిగా ఆయన చెప్పిన మాటలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆరవ్ పేర్కొన్నారు. ఆయనను కలువడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. యువతలో టెక్నికల్ నాలెడ్జ్‌ను పెంపొందించేందుకు తాను ప్రారంభించిన ‘టెక్నుట్టియీజ్’ అనే ప్లాట్‌ఫామ్‌ను ఆయనకు పరిచయం చేశానని చెప్పారు. ఆరవ్గార్గ్, ఓమి టీమ్ తమ ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.