సిటీబ్యూరో: హాస్పిటల్ పరిపాలనలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడంలో ‘సిక్స్ సిగ్మా’ విధానం కీలక పాత్ర పోషిస్తుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో, సిక్స్ సిగ్మా ట్రైనింగ్ కోఆర్డినేటర్ డా. మార్త రమేష్ సమన్వయంతో మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ కోసం ‘సిక్స్ సిగ్మా’ అంశంపై రూపొందించిన 3 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం డైరెక్టర్ డా.రాహుల్ దేవరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఆధునిక నిర్వహణ విధానాలపై విద్యార్థులు, వైద్య అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిమ్స్ డీన్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పరంజ్యోతి, మెడికల్ సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ, పరిపాలన విభాగం హెచ్ ఓడీ డా.లక్ష్మీ భాసర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా. కృష్ణారెడ్డి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్లు డా.రాకేష్, డా.చరణ్ రాజ్, డా.సల్మాన్, అంతర్జాతీయ సిక్స్ సిగ్మా నిపుణుడు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.