హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 21: ఆది శంకరాచార్యుల జయంతి, భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలను హనుమకొండ రాగన్న దర్వాజాలోని బ్రాహ్మణ భవనంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం బ్రాహ్మణ వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో స్వామివార్ల జయంతి ఉత్సవాలను ఒకే వేదికపై జరిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సతీమణి నీలిమ జ్యోతి ప్రజ్వలన గావించి శంకర రామానుజ జయంతి వేడుకలను ప్రారంభించారు.
ఆది శంకరాచార్యుల జయంతి, భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాల్లో.. చెరుకుపల్లి నరసింహచార్యులు, శ్రీమన్నారాయణచార్యులు శ్రీధరాచార్యులు, శ్రవణ కుమారాచార్యులు, ఇంకా 20 మంది వైష్ణవ పండితులు పాల్గొన్నారు. వీరితో పాటు పెండ్యాల సందీప్ శర్మ, లంక శివకుమార్, తనుగుల రత్నాకర్, తనుగుల అనిల్‌కుమార్, నిఖిల్, ఫణిశర్మ, గోవిందాత్రి దేవస్థానం ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాసు స్వామి, వైష్ణవ బృందం.. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సమితి రాష్ర్ట కన్వీనర్ వల్లూరి పవన్‌కుమార్, రాష్ర్ట గౌరవ అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ నేతృత్వంలో ఉభయ వేదాంత ఆచార్యులకు చోడ శోపచార పూజలు నిర్వర్తించారు.
నీరాజన మంత్రపుష్పం అనంతరం 200 మంది బ్రాహ్మణ మహిళలకు వేద పండితులకు పట్టు వస్త్రాలు, చీరలు, కండువలు పంపిణీ చేశారు. బ్రాహ్మణ భవన్ నుండి చిన్న కోవెల వరకు వందలాది మంది మహిళలు భజనలతో స్వామివారి చిత్రపటాలతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. మండుఎండలను లెక్కచేయకుండా శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులు శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మహిళలందరికీ స్వామివారి ప్రసాద వితరణ చేశారు.