ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కెరీర్ ఆరంభం నుంచి అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఈ కన్నడ సోయగం తాజాగా ఓ వినూత్న కథా చిత్రంలో భాగమైంది. వివరాల్లోకి వెళితే…దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వప్న సినిమాస్ సతాకంపై అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కశ్మీర్ ముస్లిమ్ అమ్మాయి అఫ్రీన్‌గా కీలక పాత్రలో నటిస్తున్నది. మంగళవారం రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ఓ కారు ముందు నిల్చొని తీక్షణమైన చూపులతో సీరియస్‌గా కనిపిస్తున్నది. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ మోషన్ పోస్టర్ వీడియోను ముగించారు. యుద్ధం నేపథ్యంలో సాగే కథ ఇదని..ధైర్యసాహసాలు కలిగిన అమ్మాయిగా రష్మిక మందన్న పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రను పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఆర్ట్: వైష్ణవి రెడ్డి, సమర్పణ: వైజయంతీ మూవీస్, దర్శకత్వం: హను రాఘవపూడి.