జెనీవా: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు క్రీడలపరంగా భారీ దెబ్బ తగిలింది. అంతర్జాతీయ టోర్నీల్లో రష్యన్ జట్లను అనుమతించొద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) పిలుపునిచ్చింది. రష్యాకు మద్దతు తెలుపుతున్న బెలారస్ అథ్లెట్లను కూడా బహిష్కరించాలని పేర్కొంది. ఆ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లను టోర్నమెంట్లలో ఆడకుండా చేయాలని సోమవారం జరిగిన కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో ఐవోసీ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ క్రీడా పోటీల సమగ్రతను కాపాడేందుకు.. క్రీడాకారుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకోవాలి’ అని ఐవోసీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడితో ‘బరువెక్కిన హృదయంతో..’ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో రష్యాను బహిష్కరించని ఫిఫా తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రష్యాతో కలిసి ఆడేందుకు పలు దేశాలు నిరాకరిస్తున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ మార్చ్ 24న రష్యాతో ఆడేందుకు పోలాండ్ నిరాకరించింది. ప్రపంచ హాకీ చాంపియన్‌షిప్స్‌లో రష్యాను బహిష్కరించాలని ఫిన్లాండ్ డిమాండ్ చేయగా.. జూలైలో జరుగనున్న యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రష్యాతో ఆడబోమని స్విట్జర్లాండ్ మహిళల సాకర్ బృందం ప్రకటించింది. రష్యాతో సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు జర్మనీ సాకర్ క్లబ్ షాల్కే తెలిపింది. రష్యాపై చర్యలు తీసుకుంటేనే ప్రపంచకప్‌లో పాల్గొంటామని పోలాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్ స్పష్టం చేశాయి. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యా మ్యాచ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అన్ని క్రీడా పోటీల నుంచి రష్యా జట్లను మినహాయించాలని నిర్ణయం తీసుకుంది.