లండన్: కొంతమంది వందేండ్లకు పైబడి జీవిస్తారు. వారి గుండె ఆరోగ్యం మిగతా వారితో పోల్చితే మెరుగ్గా ఉంటుంది. తాజాగా ఆ రహస్యాన్ని ఛేదించారు బ్రిటన్లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటలీలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు. శతాధిక వృద్ధుల్లో గుండె ఆరోగ్యాన్ని పదేండ్లు వెనక్కి తీసుకెళ్లే ఓ నిర్దిష్ట జన్యువును గుర్తించారు. ఇది గుండె ఆగిపోవడంలాంటి వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న వ్యాధుల నుంచి వారిని రక్షిస్తున్నదని, వారి హృదయాలను యవ్వనంగా ఉంచుతున్నదని కనుగొన్నారు.
ఈ జన్యువును భూమి పై సగటు వయసు కంటే ఎక్కువ జీవిస్తున్న బ్లూజోన్లోని ఒకినావా (జపాన్), సార్డినా (ఇటలీ), నికోయా (కోస్టారికా), ఇకార్యా (గ్రీస్), లోమా లిండా, కాలిఫోర్నియా (యూఎస్)లో నివసించే వృద్ధుల్లో కనుగొన్నారు. ఈ జన్యువు వల్లే ఈ ప్రాంతాల వారు వందేండ్లు ఆరోగ్యంగా బతుకుతున్నట్టు తేల్చారు. వీరికి గుండె సంబంధిత వ్యాధులూ తక్కువేనని గుర్తించారు.