హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగర అభివృద్ధికి నిధుల గండం ఏర్పడింది. అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై పెట్టుకొన్న ఆశలు నీరుగారిపోతున్నాయి. నగరవ్యాప్తంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంస్థ.. నిధుల్లేక పనులు చేపట్టలేకపోతున్నది. ఫలితం గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలో ఒక్క పనికూడా ముందు కు సాగడంలేదు. దీంతో విలువైన భూములను వేలం వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం, పాలకవర్గం చూశాయి. కానీ, వివాదాలన్నీ ఆ భూములపై పడటంతో వాటి వేలంపై పెట్టుకొన్న ఆశలు చెల్లాచెదురవుతున్నాయి.
అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలోని ల్యాండ్ ఫూలింగ్, ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా ఏకంగా రూ.1,600 కోట్ల మేర నిధులను రాబట్టాలని భావించిన యం త్రాంగానికి అక్కడ నెలకొన్న భూ వివాదా లు తలనొప్పిగా మారాయి. న్యాయపరమైన చిక్కులు, టైటిల్ వివాదాలతో అనుకొన్న అంచనాలన్నీ తలకిందులు కావడంతో ఆ భూముల వేలాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు వాటితో నిధుల సమీకరణ అసాధ్యమని అధికారిక వర్గాలే ప్రకటించుకుంటున్నాయి.
హెచ్ఎండీఏ వార్షిక బడ్జెట్లో భూము ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానిదే సింహభాగం. గ్రేటర్ చుట్టుపక్కల ప్రాంతా ల్లో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, స్కై వాక్‌లు, ఓఆర్ఆర్ అనుసంధాన ప్రాజెక్టులతోపాటు మూసీ నదీతీర ప్రాంత అభివృద్ధి లాంటి మెగా ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు హెచ్ఎండీఏకు భారీగా నిధులు అవసరం. నగరంలోని అత్యంత ఐకానిక్, డిమాండ్ ఉన్న బంజారాహిల్స్ రీజియన్ పరిధిలోని ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు సమకూర్చుకోవాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో ముడిపడి ఉన్న కోర్టు కేసులు, యాజమా న్య హక్కుల వివాదాల వల్ల ఈ భూములను వేలం వేయడం సులువు కాదని అధికారులు తేల్చేశారు. దాదాపు రూ.1,600 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనుకొనే ఈ ల్యాండ్ బ్యాంక్.. వివాదాల్లో చిక్కుకోవడంతో ఇప్పుడు ఆ నిధులపై ఆశలు గల్లంతైనట్టేనని ప్రచారం జరుగుతున్నది.
హెచ్ఎండీఏ భూముల వేలం అంటేనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో క్రేజ్ ఉం టుంది. క్లియర్ టైటిల్, ఎలాంటి లిటిగేషన్లు ఉండవనే నమ్మకంతోనే బడా డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు వందలాది కోట్లు కుమ్మరించైనా ఆ ప్లాట్లను సొంతం చేసుకొనేందుకు పోటీ పడుతాయి. బంజారాహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ప్రతిపాదిత భూములకు లీగల్ క్లియరెన్స్ లేకపోవడం ప్రతికూలంగా మారింది. వివాదాస్పద భూ ములను వేలానికి ఉంచితే.. భవిష్యత్తులో కోర్టుల చ్టుటూ తిరగాల్సి వస్తుందనే భయం తో కొనుగోలుదారులు, బిల్డర్లు ఆసక్తి చూపడమే లేదు. అందుకే వేలం ప్రక్రియను సంస్థ వచ్చే నెలకు వాయిదా వేసింది.