హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధి కోసం ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఎందరో ప్రవాస భారతీయులు ఇప్పటికీ స్వదేశంపై మమకారాన్ని చాటుకొంటున్నారు. ఇక్కడి బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలను కొనసాగించడమే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక ప్రగతికి దోహపడుతున్నారు. ఇలాంటివారి సంఖ్య కొవిడ్ సంక్షోభానంతరం మరింత పెరిగినట్టు హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్బీసీ) పరిశోధనా భాగస్వామి మోరి తేల్చింది.
ఇటీవల ఈ సంస్థ అమెరికా, బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలో స్థిరపడిన 4,152 మంది ప్రవాస భారతీయులను సర్వే చేసి ‘గ్లోబల్ ఇండియన్ పల్స్’ పేరిట తొలి వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గ్లోబల్ ఇండియన్స్ 80% మంది భారత్లో ఏదోరకమైన పెట్టుబడి పెడుతున్నారని, రానున్న మూడేండ్లలో ఈ పెట్టుబడులను మరింత పెంచాలని భావిస్తున్నారని స్పష్టం చేసింది.
స్వదేశంలోని కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహమే ఇందుకు కారణమని తెలిపింది. కొవిడ్ మహమ్మారి భారత్లోని స్నేహితులు, కుటుంబీకులతో ప్రవాసులను మరింత సన్నిహితం చేసిందని, దీంతో వారు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తి చూపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.