ట్రెక్కింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు హిమాలయాలు. ఆ శీతల ప్రాంతానికి వెళ్లి ఒక్కసారైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం ట్రెక్కింగ్ అంటే నెలల తరబడి చేయాలంటూ తమలోని కోరికను అణుచుకుంటూ ఉంటారు. కానీ, కేవలం వారంరోజుల్లోనే మనసుకు నచ్చినట్లుగా ట్రెక్కింగ్ చేసే వెసులుబాటు ఉన్న ప్రాంతాలివి. అవేమిటో ఓ లుక్కేయండి..
రూపిన్ పాస్: 7 రోజులపాటు సాగే ఒక అద్బుతమైన క్రాసోవర్ ట్రెక్కింగ్ ఇది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల గుండా 43 కిలోమీటర్ల మేర విస్తరించి 15,250 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం మంచు, దట్టమైన అడవులతో ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రాంతంలో పలకరించే జలపాతాలు ట్రెక్కింగ్ చేసేవారికి మరింత ఉత్సాహాన్నిస్తాయి.
ఫ్లవర్వ్యాలీ: ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ హిమాలయాల్లో ఆరురోజులపాటు చేసే ఈ 38 కిలోమీటర్ల ప్రయాణం ఎంతో కొత్తగా ఉంటుంది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం వర్షాకాలంలో రంగురంగుల ఆల్ఫైన్ పూలతో కళకళలాడుతుంది.
బురాన్ ఘాటి: హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్లేస్. ఈ ట్రెక్ మంచుతో కప్పి ఉన్న పర్వతాలు, అడవులు, పచ్చిక బయళ్లతో భూలోక స్వర్గంగా దర్శనమిస్తుంది. ఈ ఏరియా సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. వారం రోజులపాటు సాగే ఈ ట్రెక్కింగ్ మిమ్మల్ని సిమ్లా దగ్గరున్న పబ్బర్ లోయలోని ఓక్ అడవుల నుంచి కిన్నౌర్ లోయలోని ఆపిల్ తోటల వరకు తీసుకెళ్తుంది.
హంప్తా పాస్: హిమాలయ ట్రెక్‌లలో చాలా ప్రసిద్ధమైనది హంప్తా పాస్. కులులోని పచ్చని పచ్చికబయళ్లు, మంచు కప్పుకొన్న గిరులు, స్పితి లోయలోని హిమ ఎడారి ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం హంప్తా పాస్. శారీరకంగా దృఢంగా ఉన్నవారికి ఈ ట్రెక్కింగ్ అనుకూలం.
చంద్రఖని పాస్: ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 3,660 మీటర్ల ఎత్తులో ఉంది. డియో టిబ్బా, పిర్ పంజాల్ పర్వత శ్రేణులు ఈ మార్గంలో ట్రెక్కింగ్ చేసేవారికి కనువిందు చేస్తాయి.
చాదర్ ట్రెక్: చాదర్ ట్రెక్ అనేది లడఖ్‌లోని జాంస్కర్ నదిపై ఘనీభవించిన మంచుపై నడిచే ఒక సాహస యాత్ర. సముద్రమట్టానికి సుమారు 11,100 అడుగుల ఎత్తులో ప్రారంభమయ్యే ఈ మార్గం జనవరి, ఫిబ్రవరి నెలలో ట్రెక్కింగ్‌కు అనుకూలం.