న్యూఢిల్లీ: డెంగ్యూ (Dengue), చికున్గున్యాలపై (Chikungunya) పోరాటానికి మలేసియా (Malaysia) ప్రభుత్వం 65,000 మగ దోమలను విడుదల చేసింది. ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన ఈ దోమల్లో వోల్బేచియా అనే బ్యాక్టీరియం ఉంటుంది. వీటి ద్వారా పుట్టే దోమల్లో కూడా ఈ బ్యాక్టీరియం ఉంటుంది. ఈ బ్యాక్టీరియం ఉండటం వల్ల డెంగ్యూ, జికా లేదా చికున్‌గున్యా వైరస్లు దోమల్లో పెరగవు. ఇటువంటి దోమలు కుట్టినప్పటికీ ఈ వ్యాధులను వ్యాప్తి చేయలేవు. ప్రభుత్వం విడుదల చేసిన దోమల పని ఒకటే.
సాధారణ ఆడ దోమలతో కలిసి, తమలోని రక్షణాత్మక జన్యువును వ్యాపింపజేయడమే. ఈ ప్రాజెక్టు నవంబర్ నుంచి వచ్చే నెల వరకు కొనసాగుతుంది. కౌలాలంపూర్ నగరంలోని మొత్తం దోమలను సురక్షితమైనవిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదిలావుండగా, ఈ విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. దీనిని ఉపయోగించిన ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాల్లో డెంగ్యూ 70-90 శాతం తగ్గింది. మన దేశంలో ఐసీఎంఆర్, బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ దీనిపై పరిశోధన చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఇటువంటి మగ దోమలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.