అర్ధరాత్రి వరకు మద్యం తాగారు.. టీ తాగుదామని.. మైకంలోనే కారెక్కారు. మత్తులో ఉన్న డ్రైవర్ 140 కి.మీ వేగంతో నడిపాడు.. ఏమైందో ఏమో తెలియదు..ఒక్కసారిగా కారు చెట్టును ఢీకొట్టి.. రెండు ముక్కలైంది.. రెప్పపాటులో ముగ్గురి జీవితాలు ఛిద్రమయ్యాయి. ఒకరు తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు. మృతుల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. కలవరపాటుకు గురిచేసిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది.
గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో షార్ట్ ఫిలింలను రూపొందించే సాయి సిద్ధు (25) తన స్నేహితుడు ప్రసాద్‌లతో కలిసి రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల నుంచి తన స్నేహితురాలు కర్నాటకకు చెందిన ఎన్. మానస(23)తో షార్ట్‌ఫిలింలో నటిస్తున్నాడు. శుక్రవారం వారు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సిద్ధు తన స్నేహితుడు మాదాపూర్ యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్న అబ్దుల్ రహీం(25), ఎం. మానస, ఎన్.మానస(21), ప్రసాద్ అందరూ కలిసి రాత్రి 1.30 వరకు మద్యం సేవించారు. సాయిసిద్ధు తాగలేదు.
ఆ తర్వాత మానసలు టీ తాగుదామని చెప్పడంతో ‘జూమ్’ యాప్‌లో అద్దెకు తీసుకున్న కారులో ఆ యువతులతో పాటు సాయి సిద్ధును తీసుకొని.. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు నుంచి లింగంపల్లిలోని బావర్చి హోటల్ దగ్గర ఇరానీ చాయ్ తాగేందుకు అబ్దుల్ రహీం బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న రహీం కారును 140 స్పీడులో నడిపాడు. అలా వీరి కారు గచ్చిబౌలి ఎస్బీఐ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఎల్లమ్మ దేవాలయం వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో చెట్టును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు తునాతునకలైంది.
వెనకాల కూర్చున్న ఎన్.మానస, ఎం.మానస రోడ్డుపై పడి.. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, అబ్దుల్ రహీం స్పాట్లోనే చనిపోయాడు. సిద్ధు పక్కకు ఉండటంతో తీవ్రంగా గాయపడి..అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ బీభత్సాన్ని చూసిన కొందరు డయల్ 100, 108కు ఫోన్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు, బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. గాయపడిన సాయిసిద్ధును దవాఖానకు తరలించగా, ముగ్గురి మృతదేహాలను మార్చురీకి పంపారు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చికిత్స అనంతరం సాయి సిద్ధును అరెస్టు చేస్తామని చెప్పారు.
ఓ సారి ప్రాణాలతో బయటపడి…
జడ్చర్లకు చెందిన ఎం.మానసకు కర్నాటకకు చెందిన ఎన్.మానసలు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఇద్దరు కూడా జూనియర్ ఆర్టిస్ట్‌లు. ఎన్.మానస, ఎం. మానసను సాయిసిద్ధు ఇంట్లో జరిగే దావత్‌కు రావాలని ఆహ్వానించింది. అక్కడ మద్యం తాగి… చాయ్ కోసం వెళ్లి..మృత్యువాతపడ్డారు. ఎం. మానస 2018లోనూ అడ్డాకుల్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చి..అమీర్‌పేట్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తున్నది.
అతివేగమే ప్రమాదానికి కారణం..
మద్యం మత్తు.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించిన అధికారులు.. ప్రమాదంపై నివేదికను తయారు చేశారు. చెట్టును ఢీకొట్టి కారు రెండు ముక్కలుగా కావడం సైబరాబాద్ పరిధిలో ఇదే మొదటి కేసుగా నిలిచింది. కారు బెలూన్లు తెరుచుకున్నా.. అవి వేగం ధాటికి ప్రాణాలు నిలుపలేకపోయాయి. మాటల్లో అటెన్షన్ డైవర్షన్ అయిపోవడం లేదా నడిపిస్తున్న సమయంలో మైకంతో నిద్రపోవడం కారణంగా కారు వేగాన్ని నియంత్రించలేక నేరుగా చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
మొత్తుకున్నా..వినలేదు..
సాయిసిద్ధు స్నేహితుడు ప్రసాద్ దావత్లో పాల్గొన్నాడు.. కానీ.. చాయ్‌కు వెళ్లలేదు. బలవంతం చేసినా తన కాలుకు గాయమైందని చెప్పి తప్పుకున్నాడు. సాయిసిద్ధు సైతం డ్రంక్ అండ్ డ్రైవింగ్ వద్దని.. పోలీసులు తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారని, పట్టుబడితే పరువు పోతుందని మొత్తుకున్నాడు. అయినా మానసలు, రహీం వినకపోవడంతో చివరకు సాయిసిద్ధు కారు ఎక్కాడు. గాయాలతో బయటపడ్డాడు.
తాగి నడపొద్దు..
మద్యం తాగి వాహనాలను నడపొద్దు. అవగాహనతో పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది సుమారు 40 వేల డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులను నమోదు చేశాం. 4 వేల మందిని జైలుకు పంపాం.