హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): భారత్ మాల ప్రయోజన ప్రాజెక్టు- ఫేజ్ 1 కింద తెలంగాణలో రూ.54,485 కోట్లతో 2,178 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ది పనులు చేపట్టాలని భావించినట్లు కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ రోడ్ల పనులన్నీ 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు. ఇందులో 568 కిలోమీటర్ల పొడవు రోడ్డు పనులకు రూ.9,906 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 336 కిలో మీటర్ల మేర పనులు పూర్తయినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి ముందు అన్ని రకాల పనులు పూర్తి చేయడానికి 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని తెలిపారు. డీపీఆర్ తయారీపాటు భూసేకరణ, అటవీ భూమి వినియోగానికి పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి సమయం పడుతుందని వెల్లడించారు.