హైదరాబాద్, అక్టోబర్ 22( నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఇప్పటికే మూడు బలగాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో మిగతా బలగాలన్నీ చేరుకుంటాయని తెలిపారు. హుజూరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఉపఎన్నికకు మరో వ్యయ పరిశీలకుడిని ఈసీ నియమించిందని చెప్పారు. నియోజకవర్గంలో 97.6 శాతం ఓటర్లు ఇప్పటివరకు మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారని, 59.9 శాతం ఓటర్లు రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని వెల్లడించారు.