గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో (Gurugram) విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్ పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గురుగ్రామ్‌లోని సెక్టార్ 109 పరిధిలో సింటెల్స్ పారాడిసో హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మహిళతోపాటు మరొకరు మృతిచెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ సహా ఇద్దరు మృతదేహాలను వెళికితీశామని అధికారులు తెలిపారు.
డైనింగ్ రూమ్ భాగంలో ఆరో అంతస్తు నుంచి కిందికి అన్ని అంతస్తుల్లో పైకప్పులు కూలిపోయాయని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిషాంత్ కుమార్ చెప్పారు. ఒకరిని ప్రాణాలతో రక్షించామని, అతడిని దవాఖానకు తరలించామని చెప్పారు. వీరు మినహా మరెవరూ గాయపడలేదని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.