సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారం వరకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా.. చివరి రోజు గురువారం ఏకంగా 13 వచ్చాయి. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు గానూ 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి 11 మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి ఏడు నామినేషన్లు వేశారు. వాస్తవంగా పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 20న ఎన్నిక, ఆదే రోజు ఫలితాలు ఉంటాయి. అయితే ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే ఎన్నిక ఉంటుందా లేదా అనేది తేలనుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, వి.జగదీశ్వర్ గౌడ్లు నామినేషన్లు వేయడంతో పార్టీలో చర్చ జరుగుతున్నది. గతంలో మాదిరిగా టీఆర్ఎస్ తొమ్మిది, ఎంఐఎం ఆరుగురికి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఖరారు చేస్తారా? లేదంటే పోటీ ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.