హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మహేందర్‌రావు పుట్టా డిమాండ్ చేశారు. సోమవారం ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చలో కమిషనరేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 78 క్యాడర్లకు చెందిన సుమారు 15000 మంది ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘సమాన పనికి సమాన వేతనం.. ప్రజారోగ్యమే మా బాధ్యత.. మా ఉద్యోగ భద్రత ప్రభుత్వ బాధ్యత’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మహేందర్‌రావు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సత్వరమే స్పందించి న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఎండీ రుక్ముద్దీన్, వైస్ ప్రెసిడెంట్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుమన్, సోషల్ మీడియా ఇన్చార్జి మొగిలి నరేశ్, స్టేట్ కో ఆర్డినేటర్ సెక్రటరీ వినోద్, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ హరిప్రియ, నేతలు వినోద, స్వప్న, రేణుక, నిహారిక, కల్యాణి, విజేత తదితరులు పాల్గొన్నారు.
చలో కమిషనరేట్ కార్యక్రమానికి తరలివస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను నిర్బంధించి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. పోలీసుల వైఖరిపై ఎన్ఎహెచ్ఎం జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరసన తెలిపే హక్కుపై నిర్బంధం విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్టుపెట్టుకొని పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కుట్రలు కట్టిపెట్టి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని స్పష్టంచేశారు.