పాలకుర్తి, సెప్టెంబర్ 24 : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరుకడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వారిని బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స వేయించారు. 14 మందికి వైద్యం చేసినట్టు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వనం శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది, యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వక పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.