12A Railway Colony Teaser| ఒకప్పుడు కామెడీ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథాంశాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ హీరోకి మంచి విజయాలు కూడా అందుతున్నాయి. అయితే హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న అల్లరోడు చివరిగా బచ్చల మల్లి, ఆ ఒక్కటి అడక్కు చిత్రాలతో కాస్త డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ’12ఎ రైల్వే కాలనీ’టైటిల్ ఫిక్స్ చేశారు. పొలిమేర’,’పొలిమేర 2′ సినిమాలకి పనిచేసిన రైటర్, డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అనిల్ అందించారు.
పొలిమేర, పొలిమేర 2 హారర్ థ్రిల్లర్స్ గా రూపొంది ఎంత మంచి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. దానికి సీక్వెల్‌గా వచ్చిన పొలిమేర 2 థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిది. ఇప్పుడు ఆ దర్శకుడు ఈ చిత్రానికి రన్నర్‌గా ఉన్నారు. సీనియర్ నటుడు సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ’12ఎ రైల్వే కాలనీ టీజర్’ విడుదలైంది. టీజర్ హార్రర్ నేపథ్యంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు అనే డైలాగ్‌తో టీజర్ మొదలు కాగా, ఇది మూవీపై సస్పెన్స్ క్రియేట్ చేసింది.
ఇక ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న…!’అంటూ టీజర్ చివర్లో నరేశ్ చెప్పే డైలాగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇందులో కనిపించే పాత్రలు ఒక్కటిగా చూపిస్తూ ఆసక్తి రేపారు. ఈ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం అందించారు. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. అల్లరి నరేష్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.