రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ సర్వే నంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిండ్రు. ఈ కుంభకోణం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడైన ఓ కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నరు. సిట్ లేదా సీఐడీ దర్యాప్తు జరిపి స్కామ్‌తో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలి.
– హరీశ్‌రావు
హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, భూముల కొల్లగొట్టుడు, కబ్జాచేసుడు నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. వెయ్యి కోట్ల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు కబ్జా పెట్టారని, తమ పేరున అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని మండిపడ్డారు. రూ.1,000 కోట్ల భూస్కామ్ వివరాలను మంగళవారం తెలంగాణ భవన్లో ఆధారాలు సహా మీడియాకు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని, ఈ కుంభకోణం వెనుక రేవంత్‌రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడైన ఓ కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారని చెప్పారు. సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి స్కామ్‌తో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పెద్దషాపూర్‌లోని సదరు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితాలోపెట్టాలని 2024 ఫిబ్రవరి 24న తహసీల్దార్‌కు ఆర్డీవో ఆదేశాలు జారీచేశారని హరీశ్‌రావు చెప్పారు. అదే రోజు ఈ భూమి ప్రభుత్వానిదేనని ఆర్డీవో హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారని గుర్తుచేశారు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదని తహసీల్ద్దార్ ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా పొందుపర్చారని తెలిపారు. ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరుగా ఇచ్చిన ఆర్డర్లను మీడియాకు చూపించారు. ఎవరెవరి పేరుతో ఎంతెంత భూమి పట్టా అయ్యిందో కూడా తమ వద్ద వివరాలను ఉన్నాయని, అవసరమైనప్పుడు అన్నీ బయటపెడుతామని, భూభారతి నుంచి తీసిన పట్టా వివరాలను హరీశ్‌రావు మీడియాకు చూపించారు. ఆర్డీవో, తహసీల్దార్ భిన్నంగా అఫిడవిట్లు ఇస్తే జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు.
వెయ్యి కోట్ల విలువైన భూ సామ్ జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కేవలం ఎమ్మార్వోను కలెక్టరేట్‌కు ట్రాన్స్ఫర్చేసి ఊరుకున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి అతి సన్నిహితుడు ఈ భూస్కామ్‌లో ఉన్నందునే ఏసీబీ వెనకి వచ్చిందని, ఆయన ఒత్తిడి వల్లే ఎమ్మార్వోను కేవలం చిన్న బదిలీతో సరిపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెయ్యి కోట్ల విలువైన భూమి వెనుక కలెక్టర్ ఉన్నారా?, ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? రాత్రికి రాత్రి ప్రైవేట్ భూమి ఎలా అయ్యింది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిపై ఆర్డీవో ఆర్డర్‌ను ధికరించి ఎవరి అండతో ఎమ్మార్వో ప్రైవేట్ వ్యక్తులకు పట్టా భూమిగా మార్చారో తేల్చాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు ఆర్డర్‌పై అప్పీల్‌కు వెళ్లి, ఆ భూమిని తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి, దీని వెనుక కలెక్టర్, సీసీఎల్ఏ, ఉన్నతాధికారులు ఉన్నారా? అని ఆరా తీయాలని పట్టుబట్టారు. మీది నిజంగా ప్రజాపాలన అయితే, ఈ స్కామ్‌లో ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం లేకపోతే తహసీల్దార్‌ను వెంటనే డిస్మిస్ చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు సబిత, సత్యవతి, కొప్పుల, ఎమ్మెల్సీలు రమణ, దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కోవ లక్ష్మి పాల్గొన్నారు.
జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ‘ఆయన ఆర్టీసీ డ్రైవర్ కావొచ్చు, కానీ, ఒక రైతుబిడ్డ. రైతుల కష్టాలు చూడలేక.. వడ్లు కొనాలని అడిగితే తప్పెలా అవుతుంది? అశోక్‌కు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, న్యాయపోరాటం, ప్రత్యక్ష పోరాటానికి ఆయన వెంటే ఉంటాం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
రంగారెడ్డి, మే 26(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామంలో 174 ఎకరాలకు సంబంధించి శంషాబాద్ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడానికి న్యాయసలహా ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దషాపూర్ భూముల విషయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై మంగళవారం వివరణ ఇచ్చారు. నిషేధిత జాబితాలోని భూముల్లోనూ తహసీల్దార్ తనకు అధికారాలు లేకపోయినా పలు ఉత్తర్వులను జారీచేశారు. తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ స్పష్టంచేశారు.