చిక్కడపల్లి, జూన్ 28: సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించారు. బీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వర్యయ్య గౌడ్ మాట్లాడుతూ కొన్నికులాల పాలన పోవాలని, అన్నికులాల పాలన రావాలని అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నదని, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమందో లెక్కలేదని విమర్శించారు. ఈ వర్గాల జనాభా తెలిస్తే వీరు చైతన్యం అవుతారని, అందుకే జనాభా లెక్కలు తేల్చడం లేదని మండిపడ్డారు. పాలకులు ఈ వర్గాలపట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు.