హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. ఇటీవలి కాలంలో తాను చేసిన వ్యాఖ్యల కారణంగా వస్తున్న వేధింపులను అడ్డుకోవాలని మంగళవారం డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చా.
ఈ విషయంలో నేను ఎలాంటి సెక్యూరిటీ అడుగలేదు. అది నేను నిర్ణయించేది కాదు. నేను అడిగింది ఒకటే.. అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పాను. నేను చేసిన కామెంట్స్‌ను ఆల్రెడీ వెనక్కి తీసుకొన్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. క్యాడర్‌కు కూడా విజ్ఞప్తి చేసింది. ఇది ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం గురించి మళ్లీ ఎందుకు మాట్లాడటం. ఏపీ పోలీసులు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు.
వాట్సాప్‌లో కూడా అలాంటిదేమీ రాలేదు. నా వినతిని డీజీపీ పరిశీలిస్తామన్నారు’ అని నాగేశ్వర్ తెలిపారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. పలుచోట్ల ఆయన్ను అరెస్టు చే యాలని పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి. ఏపీ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టోలిచౌకి సబ్జా కాలనీలోని ఆయన ఇంటివద్ద మంగళవారం తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రజా సమస్యలపై నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు అత్యంత ఆందోళనకర పరిణామమని అఖిల భారత యువజన సమాఖ్య పేర్కొంది. సోమవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యవ్యవస్థలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం రాజ్యాంగం కల్పించిన హకు అని, అలాంటి హకులను అణచివేయడానికి ఏపీ కూటమి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.