అచ్చ తెలుగు ఆడపిల్లలా అనిపిస్తుంది సింగారాల సిమ్రన్ శర్మ. ‘ఇగో’ సినిమాతో మూడేండ్ల కిందటే తెలుగువారిని పలకరించిన ఈ చిన్నది ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’తో మరోసారి మనమ్మాయే అనిపించుకున్నది. టీవీ సిరీస్‌తో కెరీర్ ప్రారంభించి, వెబ్‌సిరీస్‌తో దూసుకుపోతున్న ముంబై ముద్దుగుమ్మ సిమ్రన్ మనసులోని మాట..
ఎలాంటి ప్రణాళికా
లేకుండానే నా యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది. పదేండ్ల వయసులో ఎవరో నన్ను చూడగానే ‘అమ్మాయి ముద్దుగా ఉంది. సినిమాల్లో చేయించండి’ అని అమ్మకు సలహా ఇచ్చారట. అప్పటికి నాకు సినిమా అంటే ఏమిటో కూడా తెలీదు. కానీ కెమెరా, లైట్స్, యాక్షన్, కట్.. వగైరా వగైరా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత అదే నా కెరీర్‌గా మారిపోయింది.
సినిమా బాగా ఆడాలంటే
నటీనటులు ఎంత ముఖ్యమో కథ కూడా అంతే ప్రధానం. ఏ సినిమాకు అయినా పూర్తి బాధ్యుడు దర్శకుడే. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత మేరకు తెరపై చూపించాడు అన్నదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అందుకే, దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడానికే ప్రయత్నిస్తా.
మొదట కొన్ని యాడ్స్‌లో చేశాను. తర్వాత టీవీ షోలలో అవకాశం వచ్చింది. సోనీ, సహారా వన్ చానళ్లలో నటించాక, స్టడీస్ కోసం బ్రేక్ తీసుకున్నా. ఆ గ్యాప్‌లో ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకున్నా, ఇమేజ్ కన్సల్టెంట్‌గా ఊహించుకున్నా, షెఫ్ అవతారం ఎత్తాలని కలలుగన్నా.. ఇలా చాలా లక్ష్యాలే ఉండేవి. చివరికి నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.
నేను పెరిగిన వాతావరణానికి,
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో కీర్తి పాత్రకి అస్సలు సంబంధం లేదు. డైరెక్టర్ చెప్పింది చేయడమే నటీనటుల కర్తవ్యం కాబట్టి, ఆ క్యారెక్టర్లో లీనమైపోయా. సినిమాతో ముడిపడిన 24 విభాగాలూ కీలకమైనవే. కెమెరా, మేకప్, లైటింగ్, ఆర్ట్.. ఇలా అందరూ తమతమ బాధ్యతల్లో రాణించడం వల్లే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంతమందితో పనిచేయడం నాకు సరదాగా అనిపిస్తుంది. చిన్నప్పటినుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్ల కావచ్చు, తెలియకుండానే నాకు ఈ వృత్తిపై ఆసక్తి పెరిగింది.
షూటింగ్ ప్రారంభానికి ముందే స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు చదువుతాను. భాష అవరోధం కాకూడదనే, తెలుగు కూడా నేర్చుకున్నా. ప్రామ్టింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పడం నాకు ఇష్టం. ఏదైనా అనుమానం వస్తే మొహమాటపడకుండా దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని.
టీవీ సిరీస్‌లు, యాడ్స్ చేస్తున్నప్పుడే సినిమాల్లో అవకాశం వచ్చింది. హీరోయిన్గా నా మొదటి సినిమా ‘హమ్ చార్’. తెలుగులో ‘ఇగో’. మరో రెండు చిత్రాల్లో కూడా నటించా. కానీ కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో అంతా తలకిందులైంది. లాక్డౌన్లో సమయం వృథా చేయకుండా నా నటనను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశాను.