సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 30 : వెనుకబాటుకు గురై అభివృద్ధికి దూరంగా ఉంటున్న దళితుల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మండలకేంద్రంలోని దళితవాడల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి గంగుల పాల్గొని మట్లాడారు.స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా ఇంకా దళితవాడలు ఊరవతలే ఎందుకు ఉన్నాయని, ఈ పాపం కాంగ్రెస్, బీజేపీలది కాదా అని ప్రశ్నించారు. గతంలో గుంట జాగా కూడా లేని దళితులకు ఆర్థి క స్వావలంబన కోసం లోన్లు ఇవ్వాలంటే బ్యాంకు లింకేజీలు పెట్టి కుట్రపూరితంగా వారిని అభివృద్ధికి దూరం చేశారన్నారు.
సీఎం కేసీఆర్ వాటన్నింటిని రూపుమాపారని, దళితులు ఆత్మగౌరవంతో బతికేలా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ రోజు దళిత బంధులో రూ.పది లక్షలు రావడంతో తమకు తోచిన వ్యాపారం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ఈ పథకాన్ని సైతం మునుగోడు ప్రజలకు అందకుండా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని, ఆయనను ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని మంత్రి కోరారు. మీ ఎమ్మెల్యేను చూసి ఎన్ని రోజులైంది అని మంత్రి ప్రశ్నించగా గత ఎన్నికలకు ముందు కనిపించాడని, మళ్లీ ఇప్పుడే వస్తున్నాడని వారు బదులిచ్చారు. అలాంటి వ్యక్తి మనకు అవసరామా అని అడుగగా వద్దు అని సమాధానమిచ్చారు. ఎన్నికలో కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ ఉమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, పల్లె గోవర్ధన్‌రెడ్డి, దళిత సంఘం నేతలు ఎర్రోళ్ల రాములు, యాదయ్య, లింగస్వామి, చింతకింది వీరయ్య, ఉషమ్మ పాల్గొన్నారు.