
సంవత్సర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు చిన్నారులపై ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతున్నది. 2020 మార్చిలో దేశంలోకి వచ్చిన కరోనా వైరస్ నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ నెలలో దాని ప్రభావం ప్రారంభమైంది. ఇప్పటివరకు 62,793 మంది కరోనా బారినపడ్డారు. అందులో 9 సంవత్సరాల్లోపు చిన్నారులు 2,270 మంది మాత్రమే కాగా అందరూ రికవరీ అయ్యారు. ప్రస్తుతం 174 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇవి కూడా వారి తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు వచ్చినవే . వాస్తవానికి కరోనా వైరస్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. వారు త్వరగా కోలుకోవడంతోపాటు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
స్కూల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
త్వరగా కోలుకుంటున్నారు..
చిన్నారులకు ఇంటిలోని పెద్దల నుంచే కరోనా సోకుతున్నది. జిల్లాలో అధికంగా కొవిడ్ విస్తరించిన మార్చి, మే నెలల్లో పిల్లలు కరోనా బారిన పడినా వెంటనే కోలుకున్నారు. జిల్లాలో 9 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పాజిటివ్ శాతం 3.61 శాతమే. 10 నుంచి 19 సంవత్సరాలలోపు వారు 10శాతం ఉన్నారు. మరణాల విషయంలో 9 ఏండ్లలోపు చిన్నారులు ఒక్కరూ లేరు. 10 నుంచి 19 సంవత్సరాల్లోపు వారిలో ఒక అమ్మాయి చనిపోగా ఆమె కూడా డయాలసిస్ బాధితురాలే.
వ్యాక్సిన్లే వారికి శ్రీరామరక్ష
తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి చిన్నారులకు అందించే టీకాలు వారికి రక్షణగా ఉంటున్నాయి. ప్రధానంగా వారిలో రోగ నిరోధక శక్తి కోసం పలు రకాల టీకాలు వేస్తుంటారు. బీసీజీ, హెపటైటిస్-బీ, ఓరల్, పోలియో చుక్కలు ఇస్తారు. తర్వాత 45 రోజుల నుంచి కంఠవాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా, హెపటైటిస్ బీకి సంబంధించిన పెంటా వ్యాక్సిన్ ఇస్తారు. వీటితోపాటు రోటా ఐపీవీ, ఓపీవీ వేస్తారు. ఇలా నెలరోజుల వ్యవధిలో మూడు సార్లు వ్యాక్సిన్ వేస్తారు. 10వ నెలలో ఎంఆర్ 1, విటమిన్ ఏ, ఒకటిన్నర ఏడాదికి ఎంఆర్ 2, డీపీటీ, విటమిన్ ఏ, బూస్టర్ వేస్తారు. ఐదేళ్లు, పదేళ్లకు ఒక డీపీటీ అందిస్తారు. అనంతరం 16 ఏండ్లకు టీడీ వేస్తారు. ఇలా పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్‌ను దీటుగా ఎదుర్కొంటారు.
పిల్లల్లో యాంటీ బాడీలు ఎక్కువ
పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో యాంటీబాడీలతోపాటు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదు. ఏడాదిలోపు పిల్లలకు కరోనా సోకదు. 6-18 ఏండ్ల వారు జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచే గుండెకు రంధ్రంతో బాధపడేవారు డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికే కాస్త ఇబ్బంది.
టీకాలు వేయించడంలో అలసత్వమొద్దు
కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు సూచించిన విధంగా చిన్న పిల్లలకు సమయానుసారం టీకాలు వేయిండంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి పెంచి చిన్నారులకు వైరస్లు సోకకుండా టీకాలు రక్షిస్తాయి. బాల్యం నుంచి క్రమం తప్పకుండా టీకాలు వేయించడంతోపాటు పౌష్టికాహారం అందించాలి. పిల్లలకు అనారోగ్య సూచనలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.