హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజును రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
సీఎస్ రేసులో సీనియర్ అధికారులైన సంజయ్ జాజు, వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్ ఉన్నారు. అయితే, సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఇక పోటీ వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్ మధ్య ఉన్నదనే చర్చ జరిగింది. హఠాత్తుగా సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి రాష్ర్టానికి వస్తుండటం, అది కూడా రాష్ట్ర విజ్ఞప్తి మేరకే ఆయనను రిలీవ్ చేస్తున్నట్టు కేంద్రం పేర్కొనడం సంచనలంగా మారింది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ సంజయ్ జాజు అనే ప్రచారం జోరందుకున్నది. ఇదే జరిగితే ఇప్పటివరకు సీఎస్ పోస్టుపై గంపెడు ఆశలు పెట్టుకున్న జయేశ్‌రంజన్‌కు ఆశాభంగం తప్పదనే చర్చ జరుగుతున్నది.
1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు 12 ఏండ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 2014 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఆయన కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.