
మందమర్రి రూరల్ నవంబర్ 19: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్ పురుషోత్తం (58) మరణించారు. శుక్రవారం మొదటి షిప్టులో విధులకు వెళ్లిన ఆయన సంప్లోని మట్టిని తొలగించే పనులను పర్యవేక్షిస్తున్నారు. పెద్దగుట్టగా మారిన బురద మట్టిని పరిశీలించేందుకు ఆయన ఎత్తయిన బురద కుప్పకు అవతలి పక్కకు వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతమంతా బురదగా ఉండటంతో పురుషోత్తం రెండు కాళ్లు అందులో దిగబడ్డాయి. దీన్ని గమనించని ఆపరేటర్ సంప్ నుంచి తీసిన బురదను పైనుంచి పోయడంతో అందులోని పెద్ద బండరాయి పురుషోత్తం తలపై పడింది. తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పురుషోత్తం మృతి పట్ల అధికారులు, కార్మిక నాయకులు, తోటి కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అండర్ మేనేజర్ పురుషోత్తం మృతికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొన్నారు. పురుషోత్తం కుటుంబానికి ప్రభుత్వ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.