Womens Health | ఉదయం నిద్రలేచినప్పటి నుంచే అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం, ఏ పని చేసినా త్వరగా శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలను చాలామంది మహిళలు సాధారణంగా తీసుకుంటుంటారు. ఇంటి పనులు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి కారణంగానే ఇలా జరుగుతుందని భావిస్తారు. అయితే నిరంతర అలసట వెనుక శరీరంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన మార్పులు కారణమై ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐరన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి వంటి అంశాలు మహిళల శక్తిస్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను కణాలకు చేరవేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. దీంతో అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. తక్కువ స్థాయి ఐరన్ లోపం ఉన్నప్పటికీ అలసట తీవ్రంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో నెలసరి సమయంలో రక్తనష్టం జరగడం, గర్భధారణ సమయంలో పోషక అవసరాలు పెరగడం, ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచిస్తున్నారు. హార్మోన్లు కూడా మహిళల శక్తి స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. నెలసరి చక్రంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మార్పుల వల్ల అలసట, చిరాకు, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్‌కు ముందు ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గినప్పుడు కూడా శరీరంలో మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల అలసట, బరువు పెరగడం, చలి ఎక్కువగా అనిపించడం, ఆలోచనా శక్తి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. హైపోథైరాయిడిజం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ప్రారంభ దశలో లక్షణాలు సాధారణ అలసటలా ఉండటంతో చాలామంది గుర్తించలేకపోతున్నారు.
ఒత్తిడి కూడా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువకాలం మానసిక ఒత్తిడిలో ఉంటే కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగి నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తాయి. సరిపడా నిద్రపోయినా అలసట తగ్గకపోవడం, రోజంతా శక్తిలేకపోవడం వంటి సమస్యలు దీనివల్ల వస్తాయి. ఐరన్ లోపం, హార్మోన్ల అసమతుల్యత ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తస్రావం వల్ల ఐరన్ నిల్వలు తగ్గిపోతాయి. మరోవైపు హార్మోన్ల మార్పులు ఆకలి, జీర్ణక్రియ, పోషకాల శోషణపై ప్రభావం చూపుతాయి. దీంతో అలసట మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జీవనశైలి కూడా అలసటకు ప్రధాన కారణంగా మారుతోంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆకుకూరలు, పప్పులు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం వంటి అలవాట్లు శరీర శక్తిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిరంతర అలసటను తగ్గించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఐరన్, థైరాయిడ్ స్థాయిలను పరిశీలించడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించడం, సరైన నిద్రపోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నిరంతర అలసటను సాధారణ సమస్యగా తీసుకోవడం సరైంది కాదని ఇది శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంతోపాటు జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.