‘మాకు మహిళలు అంటే గౌరవం. మహిళా కస్టమర్ల వ్యక్తిత్వానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ ప్రోత్సహించం’ అని నిరూపించుకోవడానికి ఉమెన్స్‌డే సందర్భంగా అనేక సంస్థలు వినూత్నమైన ప్రకటనలను జారీ చేశాయి. మచ్చుకు ఓయో రూమ్స్ ప్రకటననే తీసుకుందాం… సాధారణంగా ఓయో రూమ్స్ యాడ్స్‌లో ‘గది అద్దె రూ. (పన్నులతో సహా) అన్న సమాచారం ఉంటుంది. పక్కనే ఓ అందమైన అమ్మాయి ఫొటో ఉంటుంది. ఆకతాయిలు ‘ఆ ప్యాకేజీలో అమ్మాయి కూడా వచ్చేస్తుందా?’ తరహా చిల్లర వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘ఇలాంటి వాటిని మేం తేలిగ్గా తీసుకోం. వాళ్లు క్షమాపణలు చెప్పేదాకా వదిలి పెట్టం. అలా, గత ఏడాదిలో దాదాపు 300 మందితో ఇ- గుంజీలు తీయించాం’ అన్నది తాజా ప్రకటన సారాంశం. ఉబెర్ అయితే, WFH.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సరికొత్త నిర్వచనం ఇస్తూ.. ‘వర్క్ ఫర్ హర్’ అని భాష్యం ఇచ్చింది.