Pahalgam attack : ఈ నెల 22న జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాదుల (Terrorists) దాడిలో 26 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఒక్కక్కరిని పేర్లు అడుగుతూ కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మరణించిన 26 మంది పర్యాటకుల్లో ఇండియన్ నేవీ అధికారి (Indian Navy officer), లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Vinay Narwal) కూడా ఒకరు.
లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్య హిమాన్షి నర్వాల్ బైసరాన్ లోయలోని ఓ చోట బేల్‌పూరీ తింటుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నర్వాల్ తలలో బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన హిమాన్షి నర్వాల్ గుండెలవిసేలా రోధించింది. ఆఖరికి అలిసిపోయి భర్త మృతదేహం పక్కనే దిక్కు తోచని స్థితిలో కూర్చుండిపోయింది. హిమాన్షి తన భర్త డెడ్ బాడీ పక్కన ధీనంగా కూర్చుని ఉన్న ఆ ఒక్క ఫొటోతో క్రూరాతిక్రూరమైన పహల్గాం ఉగ్రదాడి కళ్లముందు కదలాడుతుంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయిన ఎల్విస్ యాదవ్.. ఇటీవలి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్‌కు, తనకు ముందు ఉన్న సంబంధం గురించి వెల్లడించాడు. వినయ్ భార్య హిమాన్షి నర్వాల్, తాను ఇద్దరం క్లాస్మేట్స్మని, గుర్గావ్లో ఇద్దరం కలిసి చదువుకున్నామని చెప్పాడు. కాలేజీ రోజుల్లో హిమాన్షి, తాను మంచి స్నేహితులమని, ఇద్దరం కలిసి మెట్రోస్టేషన్‌కు వెళ్లేవాళ్లమని ఆయన గుర్తుచేసుకున్నాడు.
2018లో కాలేజీ పూర్తయిన తర్వాత కలుసుకోలేదని చెప్పాడు. ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన ఫొటోలో భర్త పక్కన కూర్చున్న హిమాన్షిని తాను ముందుగా గుర్తుపట్టలేదని, ఆమెలా ఉందని పరిశీలించి చూడటంతో ఆమే హిమాన్షి అని గుర్తించానని తెలిపాడు. ఆమె ఫోన్ నంబర్ కూడా తన దగ్గర ఉందని, కానీ ఆ పరిస్థితుల్లో ఫోన్ చేయడం కరెక్ట్ కాదని భావించి చేయలేదని చెప్పాడు. ఆ తర్వాత తాను మా ఇద్దరికీ క్లోజ్‌గా ఉండే ఓ ఫ్రెండ్‌ను కలిశానని, అతడు 30 సార్లు కాల్ చేసినా హిమాన్షి తీయలేదని, 31వ సారికి లిఫ్ట్ చేసిందని చెప్పాడు.
అప్పుడు ఆమెకు ధైర్యం చెప్పి పెట్టేశామని, ఆమె ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పడం కష్టమేనని ఎల్విస్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా ఈ నెల 16ననే వినయ్ నర్వాల్, హిమాన్షిల వివాహం జరిగింది. ఈ నెల 19న విందు కార్యక్రమం జరిగింది. ఈ నెల 21న దంపతులిద్దరూ పహల్గాంకు హనీమూన్ వెళ్లారు. 22న ఉగ్రవాదుల దాడిలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లయ్యి వారం రోజులు కూడా తిరగకముందే విధి ఆ ఇద్దరినీ విడదీసింది.