ఒకటి కాదు.. రెండు కాదు.. 100 మొమోస్ ఒకేసారి తినడమంటే మామూలు విషయం కాదు. నిజానికి.. మోమోస్ అనేవి సౌత్ ఇండియన్స్‌కు పెద్దగా పరిచయం లేని స్నాక్. ఇది ఎక్కువగా నేపాల్‌లో దొరుకుతుంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా మోమోస్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. కాకపోతే.. మన దగ్గర నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ మోమోస్ అమ్మేవాళ్లు అక్కడక్కడా కనిపిస్తారు.
సాధారణంగా ఓ 10 మోమోస్ తింటే.. కడుపు నిండిపోతుంది. మళ్లీ అన్నం తినాలన్నా కష్టమే. కానీ.. ఓ యువతి మాత్రం ఏకంగా 100 మోమోస్ తినేందుకు చాలెంజ్‌ను స్వీకరించింది. అవి కూడా చికెన్ మోమోస్. ఆ యువతి ఒక యూట్యూబర్. తన పేరు మాధురి లహరి. తనకు మ్యాడీ ఈట్స్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఆ చానెల్లో ఇలా ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మోమోస్ చాలెంజ్‌ను స్వీకరించి.. 100 మోమోస్ తినేందుకు తెగ ప్రయత్నించింది కానీ.. 100 మోమోస్ తినలేకపోయింది. చివరకు ఓ 20 మోమోస్‌ను మిగిల్చినా.. 80 మోమోస్ తిని గ్రేట్ అనిపించుకుంది. ఈ చాలెంజ్ చేసి చాలా రోజులే అయినా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. ఏంటి తల్లి.. ఎందుకు నీకు అంత కష్టం. అనవసరమైన చెత్తను తిని లేనిపోని రోగాలు తెచ్చుకుంటావా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే.. అన్ని మోమోస్ తినడం కోసం తను ప్రయత్నించిన తీరును మెచ్చుకుంటున్నారు.