భోపాల్: ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించిన వ్యక్తిపై బీజేపీ మంత్రి మండిపడ్డారు. అతడి నడుం విరుగుతుందని హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఖాండ్వా జిల్లాలోని గోల్ఖెడా ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి విజయ్ షా పాల్గొన్నారు. ఆయన ప్రసంగించినప్పుడు ఒక వ్యక్తి పైకి లేచాడు. అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న తన భార్యకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపాడు.
కాగా, బీజేపీ మంత్రి విజయ్ షా ఆ వ్యక్తిపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో తాము అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించే వారి నడుం పోలీసులు విరుగ్గొడతారు’ అని మంత్రి షా హెచ్చరించారు. సమస్యను లేవనెత్తిన ఆ వ్యక్తికి మద్యం తాగించి కార్యక్రమం అంతరాయం కోసం కాంగ్రెస్ పార్టీ పంపిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ నేత నీకు ఎంత ఇచ్చారు? అని ప్రశ్నించారు.
అలాగే స్థానిక కాంగ్రెస్ నేతపై కూడా మంత్రి విజయ్ షా మండిపడ్డారు. ‘నాకు తెలుసు, ఆయన ప్రజలకు మద్యం పోయించి ఇలా చేయాలని చెబుతాడు’ అని ఆరోపించారు. ఈ ప్రాంతంలో మద్యం అమ్ముతున్న వ్యక్తులను పట్టుకోవాలని అక్కడున్న పోలీసులను ఆయన ఆదేశించారు. ఇక్కడ అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న విషయం తనకు తెలుసని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
विजय शाह एक युवक पर हो गए गुस्सा कहा-यह सरकार की सभा है, बिगाड़ोगे तो फोड़ देंगे"
MP के खंडवा में विकास यात्रा के दौरान मंत्री pic.twitter.com/s0bWdepuIz— Priya singh (@priyarajputlive) February 15, 2023