న్యూఢిల్లీ, డిసెంబర్ 13: డబ్బు ఖర్చుపెట్టడంలో యువ భారతీయులు సంప్రదాయ పద్ధతులకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, రెడీమేడ్ దుస్తులపై మోజు తగ్గించుకుంటున్న యువత కొత్త పంథాలో సాగుతున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన కోట్లాది యూపీఐ లావాదేవీలను ఆధారం చేసుకుని డబ్బు నిర్వహణలో జెన్ జీ ఆలోచనా ధోరణి ఎలా ఉందో సూపర్ మనీ తన అధ్యయన నివేదికలో విశదీకరించింది.
డిజిటల్ చెల్లింపులు, చిరు కొనుగోళ్లు, క్రెడిట్ కార్డుల వినియోగంపై చేసిన అధ్యయనం డబ్బు ఖర్చు చేయడంలో దేశవ్యాప్తంగా యువజనుల ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలలో నివసించే 30 ఏండ్ల లోపు వయసు ఉన్న వారిలో 72 శాతం మంది ఆర్థిక ప్రవర్తన ఒకే రీతిన ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 74 శాతం మంది నెలకు 50కి పైగా డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా వీరిలో చాలా మంది నెలకు 200కి పైగా లావాదేవీలు జరుపుతున్నారు.
దేశవ్యాప్తంగా తక్కువ మొత్తంలో డబ్బు చెల్లింపులే ఎక్కువగా జరగడం విశేషం. 76 శాతం చెల్లింపులు రూ.200 లోపే ఉంటున్నాయి. వీటిలో నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లలో ఆర్డర్లు, పచారీ సామాన్లు వంటివే ఎక్కువగా ఉంటున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఫుడ్ ఆర్డర్లే ఎక్కువగా ఉంటున్నాయని అధ్యనంలో తేలింది.
ఉదయం 6-11 గంటల మధ్య పచారీ సామాన్లు, సూపర్ మార్కెట్ కొనుగోళ్లు అధికంగా ఉంటున్నాయి. మెట్రోలు, ప్రధాన నగరాలలో ఉదయం 6-11 గంటల మధ్య అత్యధిక డిజిటల్ లావాదేవీలు టిఫిన్ ఆర్డర్లు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లే ఉంటున్నాయి. నెలవారీగా వస్తువుల కొనుగోలుకు స్వస్తి చెప్పి అప్పటికప్పుడు కావలసిన వస్తువులను తెప్పించుకునేందుకు డిజిటల్ సౌకర్యానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతుంది.
భారతదేశ వ్యాప్తంగా అన్ని మెట్రో, పెద్ద నగరాలు మొదలుకుని చిన్న పట్టణాల వరకు శుక్రవారం సాయంత్రం 7-8 గంటల మధ్య అత్యధిక లావాదేవీలు జరుగుతున్నట్లు అధ్యయనంలో బయటపడింది. పల్లెల్లోనూ యూపీఐదే హవా యూపీఐ చెల్లింపులు ఇప్పుడు మెట్రోలు, టైర్-2, టైర్-4 నగరాల నుంచి పల్లెల దాకా వ్యాపించాయి. దాదాపు 41 శాతం మంది ప్రజలు డిజిటల్ చెల్లింపులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు అధ్యయనం చెబుతున్నది.