న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ‘మెల్లగా మాట్లాడండి.. గోడలకు చెవులుంటాయి’ అనే మాటలు ఇప్పటివరకు విన్నాం. ఇక నుంచి ‘ఫోన్లకూ చెవులుంటాయి’ అని వినే కాలం వచ్చింది. మీ ఫోన్ల ద్వారా మీకు తెలియకుండానే మీ మాటలను కొన్ని కంపెనీలు వింటాయి. మీ అవసరాలను గుర్తిస్తాయి. మీరు ఏం కొనాలనుకుంటున్నారో పసిగడతాయి. మిమ్మల్ని లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు గుప్పిస్తాయి. ఇదంతా సాధ్యమే అంటూ ఇంతకాలంగా టెక్ నిపుణులు చెప్తున్నప్పటికీ సరైన ఆధారాలు లేవు. తాజాగా అమెరికాకు చెందిన కాక్స్ మీడియా గ్రూప్(సీఎంజీ) అనే ఓ కంపెనీ తన నివేదికలో ఈ విషయాలను ధ్రువపరిచింది. తమ వద్ద ప్రజల మాటలను వినే ‘యాక్టివ్ లిజెనింగ్’ సాంకేతికత ఉన్నట్టు ఈ సంస్థ అంగీకరించింది.
మనం గూగుల్‌లో ఏదైనా వస్తువు గురించి సెర్చ్ చేసిన తర్వాత మనం ఏ వెబ్సైట్ బ్రౌజ్ చేసినా, ఏ యాప్ వినియోగించినా ఆ వస్తువుకు సంబంధించిన ప్రకటనలే కనిపిస్తూ ఉంటాయి. ఆయా కంపెనీలు మన బ్రౌజింగ్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఈ రకంగా లక్షిత ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరిపోయింది. కొన్నిసార్లు మనం ఏ వస్తువు గురించైనా పక్క వారితో మాట్లాడిన తర్వాత మన ఫోన్లో ఆ వస్తువుకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది మనల్ని ఆశ్చర్యపరిచినా.. యాదృచ్ఛికం కావొచ్చులే అనుకుంటాం. అయితే, ఇది యాదృచ్ఛికం కాదు.. అధునాతన సాంకేతికతతో టెక్ కంపెనీలు పన్నుతున్న పక్కా వ్యూహం. తాము స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, వంటి 470 మార్గాల ద్వారా వాయిస్ డాటాను క్యాప్చర్ చేసి, విశ్లేషిస్తామని సీఎంజీ సంస్థ.. తన ఇన్వెస్టర్లకు సమర్పించిన ఒక నివేదికలో పేర్కొన్నట్టు ‘404 మీడియా’ కథనం తెలిపింది.
తాము అభివృద్ధి చేసిన ‘యాక్టివ్ లిజెనింగ్’ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ సహా మైక్రోఫోన్స్ ఉండే స్మార్ట్ పరికరాల నుంచి సేకరించిన సమాచారాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో విశ్లేషించి.. వినియోగదారులు ఏం కొనాలనుకుంటున్నారు, వారి ప్రవర్తనను తెలుసుకుంటామని ఈ కంపెనీ చెప్పినట్టు ‘404 మీడియా’ కథనం పేర్కొన్నది. అయితే, ఈ టెక్నాలజీ తమ వద్ద ఉన్నట్టు ఈ సంస్థ బయటపెట్టినప్పటికీ ఇప్పటికే చాలా కంపెనీలు దీనిని వినియోగిస్తుండవచ్చని టెక్ నిపుణులు అనుమానిస్తున్నారు. అందుకే, మనం మాట్లాడుకునే వస్తువులకు సంబంధించిన ప్రకటనలకు మనకు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మైక్రోఫోన్‌ను వినేందుకు అనుమతి ఇవ్వవద్దని, తద్వారా కొంతవరకు ఈ టెక్నాలజీ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.