న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే(Abhijeet Dipke) నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ పార్టీ మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో జంతర్ మంతర్ చేరుకున్నారు. భారీ భద్రత నడుమ ఆందోళన కొనసాగుతోంది. జంతర్ మంతర్ చేరుకున్న ఉద్యమకారులను ఉద్దేశిస్తూ అభిజీత్ మాట్లాడారు. ఇది చాలా సుదీర్ఘ పోరాటం అని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని సోషల్ మీడియాలో నెల రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నామని, కానీ సిగ్గులేని వ్యక్తులు ఆ చర్య తీసుకోవడం లేదని, వాళ్లు ఇతర అంశాలపై ఫోకస్ పెట్టారని, మన అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని, పోస్టులను డిలీట్ చేస్తున్నారని దీప్కే ఆరోపించాడు. మీరు పోస్టులను డిలీట్ చేయవచ్చు, కానీ, మమ్మల్ని మార్చలేరని దీప్కే అన్నాడు.
జంతర్ మంతర్ నిరసన ప్రదర్శనకు హాజరైన యువత నినాదాలు చేశారు. ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.