Yoga | బెంగళూరు: కర్ణాటకలో ఓ యోగా టీచర్ (34) శ్వాస చిట్కాలతో మరణించినట్లు నటించి, హంతకుల బారి నుంచి తప్పించుకున్నారు. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి ఫిర్యాదు మేరకు బిందు అనే మహిళను, ఆమె స్నేహితుడు సతీశ్ రెడ్డిని, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తన భర్తకు యోగా టీచర్‌తో అక్రమ సంబంధం ఉందని బిందు అనుమానించింది. డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న సతీశ్ రెడ్డిని కలిసి, తన భర్త, యోగా టీచర్ కదలికలపై నిఘా పెట్టాలని కోరింది. అనంతరం రెడ్డి ఆ యోగా టీచర్ వద్దకు యోగా నేర్చుకునే నెపంతో వెళ్లాడు.
ఆమెకు నమ్మకం కలిగించాడు. నగరంలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తానని చెప్పి గత నెల 23న డిబ్బురహళ్లిలోని ఆమె ఇంటి నుంచి కారులో తీసుకెళ్లాడు. ఆ కారులో మరో ముగ్గురు ఉన్నారు. ఆమెను శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి, ఆమె బట్టలు విప్పేసి, ఆమెపై దాడి చేశారు. ఓ వైరుతో ఆమె గొంతు నులిమేశారు. దీంతో ఆమె యోగా చిట్కాలతో మరణించినట్లు నటించారు. ఆమె మరణించినట్లు భావించి, వీరంతా ఓ గోతిలో ఆమెను పూడ్చిపెట్టారు. ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను తీసుకెళ్లిపోయారు. అనంతరం ఆమె ఆ గొయ్యి నుంచి ఎలాగోలా బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును ఈ దుండగులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.