ISRO Xposat | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) రేపు ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. కౌంట్‌డౌన్ 24 గంటల పాటు కొనసాగుతుంది. జనవరి 1న ఉదయం 9.10 గంటలకు పీఎసీఎల్పీ సీ-58 రాకెట్ ఎక్స్పో శాటిలైట్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి మోసుకెళ్లనున్నది. నూతన సంవత్సరం తొలిరోజునే ఇస్రో ప్రయోగం చేపట్టేందుకు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు అమిత్‌కుమార్ పాత్ర, విక్టర్ జోసెఫ్, యశోద, శ్రీనివాస్ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. పీఎస్ఎల్వీ-సీ58, ఎక్స్‌పోశాట్ నమూనాలను శ్రీవారి పాదాల చెంతపెట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్‌హోల్ ఎక్స్-రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్-థర్మల్ సూపర్నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పొశాట్ అధ్యయనం చేయబోతున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార తక్కువ భూ కక్ష్యలో ఉంచనున్నారు. ఎక్స్‌పోశాట్ దాదాపు ఐదేళ్ల పాటు సేవలు అందించనున్నది. ఇందులో రెండు పేలోడ్స్ ఉంటాయి. పాలిఎక్స్ (X-కిరణాలలో పోలారిమీటర్ పరికరం), XSPECT (ఎక్స్-రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్). పోలిక్స్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా.. ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది.
ఖగోళ వస్తువులు, తోకచుక్కుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్ సేకరించనున్నది. ఎక్స్‌పొశాట్ మిషన్ తనలోని రెండు పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్-కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేస్తుంది. శాటిలైట్ బ్లాక్ హోల్స్‌ను కూడా అధ్యయనం చేస్తుంది. ఇదిలా ఉండగా.. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇస్రో 60వ మిషన్ చేపట్టబోతున్నది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59 ప్రయోగాలు చేపట్టింది. 60వ మిషన్‌లో భాగంగా ఎక్స్పో శాట్‌ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఒకటో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి పంపనున్నది.