న్యూఢిల్లీ: మహిళ రొమ్ము పట్టుకుని ఆమె పైజామా బొందు లాగి తెంచేయడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఇది తప్పుడు తీర్పని అన్నారు. (Wrong Judgment) ఇలాంటి తీర్పు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించాలని ఆమె కోరారు.
కాగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఈ వివాదస్పద తీర్పుపై పలు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు, నాయకురాళ్లు స్పందించారు. ‘చాలా దురదృష్టకరం. తీర్పులో చేసిన వ్యాఖ్యల పట్ల నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. ఇది చాలా అవమానకరమైన దృష్టాంతం. ఆ వ్యక్తులు చేసిన చర్యను అత్యాచారానికి పాల్పడే చర్యగా ఎందుకు పరిగణించడం లేదు? ఈ తీర్పు వెనుక ఉన్న లాజిక్ నాకు అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆప్ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు.
మరోవైపు దేశంలో మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధానం చాలా అసహ్యంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జూన్ మాలియా విమర్శించారు. దీనిని మనం అధిగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ కూడా ఈ తీర్పుపై స్పందించారు. సుప్రీంకోర్టు సుమోటోగా దీనిని స్వీకరించాలని ఎక్స్ పోస్ట్‌లో కోరారు.