ప్రపంచంలో ఎక్కువ మంది వాడే మీడియా ఫేస్బుక్. వినియోగ దారులకు మరింత చేరువ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. అలా తెచ్చిందే మెమోరియలైజేషన్. చనిపోయిన వ్యక్తుల అకౌంట్లను ఫేస్బుక్ మెమోరియలైజ్ చేస్తుంది. ఆ అకౌంట్లలో స్నేహితులు, బంధువులు వచ్చి, మరణించిన వ్యక్తులపై తమ మనసులోని భావాలను పంచుకుంటారు. దీన్నే మెమోరియలైజ్ చేయడం అంటారు. ఇంత వరకూ బాగానే వుంది. కానీ.. ఇప్పుడు జరిగిందే వింతగా వుంది.
ఎందుకంటే.. వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ బతికే వున్నా, చనిపోయినట్లు ఫేస్బుక్ భావించింది. ఆమె అకౌంట్‌ను మెమోరియలైజ్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆమె.. మరో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఈ విషయాన్ని చెబుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఫేస్బుక్.. నేను బతికే వున్నాను.. నా అకౌంట్ నాకు ఇచ్చేయ్ అంటూ ట్వీట్ చేసింది. ‘ఫేస్బుక్ నన్ను చంపేసింది. నేను ఇంకా బతికే వున్నా. ఆస్పత్రి పాలుకాలేదు. అనారోగ్యంగా లేను. కానీ ఫేస్బుక్ నా అకౌంట్‌ను మెమోరియలైజ్ చేసేసింది.’ అని తస్లీమా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇప్పటి వరకూ ఫేస్బుక్ యాజమాన్యం స్పందించడం లేదు. ఇప్పటికీ ఆమె అకౌంట్ అలాగే వుంది.