పాట్నా: ఎన్నికల్లో ప్రజలను తాను ఓట్లు అడగబోనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తెలిపారు. అయితే పేదరికం నుంచి ఎలా బయటపడాలో అన్నది చెబుతానని అన్నారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ మూడేళ్లుగా బీహార్ అంతటా పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా పాదయాత్ర కూడా చేస్తున్నారు. సుమారు 5,000 గ్రామాలను కాలినడకన చేరుకున్నారు. బీహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయ. దీంతో ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాగా, గురువారం సరన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. దేశంలోని రాజకీయ పార్టీలను ఆయన విమర్శించారు. బీహార్ ప్రజలు కాంగ్రెస్‌ను 40 నుంచి 50 సంవత్సరాలు గెలిపించారని, ఆ తర్వాత వారు లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజుగా చేశారని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా నితీశ్ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించారని, అయితే వారి జీవితాలు, వారి పిల్లల జీవితాలు మెరుగుపడలేదని విమర్శించారు. గత నాయకులంతా తీయగా మాట్లాడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి వాగ్దానాలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఇతర నేతల మాదిరిగానే తాను కూడా సామాన్యులను మోసం చేయగలనని, అందుకే తాను ఓట్లు అడగబోనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ‘ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. మేం చెప్పేది విని మాకు ఓటు వేయండి. కానీ గెలిచిన తర్వాత మేం మిమ్మల్ని మోసం చేయమని హామీ ఏమిటి? కాబట్టి, నేను ఓట్లు కూడా అడగను. పేదరికం నుంచి బయటపడటానికి మీకు ఒక మార్గం చెబుతా. మీరు దానిని నేర్చుకుంటే, మీరు ఎవరికైనా ఓటు వేయవచ్చు. కానీ మేం మీకు చెప్పిన విధంగా మీరు ఓటు వేస్తే, మీ పిల్లలకు విద్య, ఉపాధి ఖచ్చితంగా బీహార్లోనే సాధ్యమవుతుంది’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.