లక్నో: పెంపుడు పిల్లి మరణించింది. దీంతో దాని యాజమానురాలు తీవ్ర మనస్తాపం చెందింది. రెండు రోజుల పాటు పిల్లి మృతదేహంతో గడిపింది. చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించింది. (Cat Dies, Woman suicide) ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హసన్పూర్ ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహమైంది. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, ఒంటరితనం నేపథ్యంలో ఒక పిల్లిని పూజా పెంచింది. అయితే ఫిబ్రవరి 25న అది చనిపోయింది. ఆ పిల్లి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని ఆమె తల్లి చెప్పింది. అయితే తన పెంపుడు పిల్లి బతుకుతుందని పూజా వాదించింది. రెండు రోజుల పాటు పిల్లి మృతదేహంతో ఆమె గడిపింది.
మరోవైపు పెంపుడు పిల్లి మరణంతో తీవ్ర మనస్తాపం చెందిన పూజా, మార్చి 1న రాత్రి వేళ గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నది. సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడి నేలపై చనిపోయిన పిల్లి మృతదేహం ఉంది. ఇది చూసిన ఆమె తల్లి ఏడ్వటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.