లక్నో: పాత ప్రియుడ్ని వదిలించుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించింది. హోలీ రోజు రాత్రి అతడ్ని పిలిచింది. కొత్త ప్రియుడితో హత్య చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితులను అరెస్ట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మర్డర్ ట్విస్ట్‌ను ఛేదించారు. (Love Triangle And A Murder) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ, దిల్జిత్ మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. అయితే ఇటీవల ఆమెకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో దిల్జిత్‌ను వదిలించుకోవాలని వారిద్దరూ కలిసి ప్లాన్ చేశారు.
కాగా, మార్చి 14న హోలీ రోజు రాత్రి కలుసుకుందామని, పెళ్లి గురించి మాట్లాడదామని దిల్జిత్‌కు ఆ మహిళ చెప్పింది. దీంతో ఆ రోజు రాత్రి 11:05 గంటల సమయంలో స్కూటీపై అతడు బయలుదేరాడు. అయితే ఆ దారిలో కాపువేసిన మహిళ కొత్త ప్రియుడు బైక్‌పై దిల్జిత్‌ను అనుసరించాడు. గన్‌తో వెనుక నుంచి కాల్పులు జరిపి చంపాడు.
మరోవైపు దిల్జిత్ హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దిల్జిత్ ప్రియురాలిని ప్రశ్నించారు. కొత్త ప్రియుడితో కలిసి అతడ్ని హత్య చేయించినట్లు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న కొత్త ప్రియుడి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మర్డర్ ట్విస్ట్‌కు సంబంధించిన ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.