ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నేమ్‌ప్లేట్‌ను ఒక మహిళ తొలగించింది. దానిని నేలకేసి విసిరి ధ్వంసం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర సచివాలయంలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రాలయంలోని దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం వద్దకు ఒక మహిళ వచ్చింది. బయట ఉన్న ఆయన నేమ్‌ప్లేట్‌ను తొలగించింది. దానిని నేలకేసికొట్టి ధ్వంసం చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ప్రవేశ అనుమతి లేకుండా ఆ మహిళ మంత్రాలయంలోకి ప్రవేశించిందని ఆరోపించారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోపల బ్యాగ్ మరచిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బందికి ఆమె చెప్పిందన్నారు. ఆ భవనంలోకి ప్రవేశించిన మహిళ డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరుకున్నదని, బయట ఉన్న నేమ్‌ప్లేట్‌ను తీసి నేలపైకి విసిరి పగలగొట్టి ధ్వంసం చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మహిళను గుర్తించేందుకు, ఆమె ఆచూకీని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.