లక్నో: ఒక ఇంటి నుంచి రెండు రోజులుగా ఆగకుండా పెద్ద సౌండ్‌తో (Loud Music) మ్యూజిక్ వినిపిస్తున్నది. దీంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఒక మహిళను బంధువులు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేసి ఉంచేసినట్లు గ్రహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల సమీనా సోమవారం ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌లో ఉన్న బంధువులైన హీనా, రమేష్ ఇంటికి వెళ్లింది. వారి కుమారుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొంది.
కాగా, ఆ ఇంట్లో రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో సమీనా చోరీ చేసినట్లు హీనా, రమేష్ అనుమానించారు. కర్రలు, రాడ్లతో ఆమెను కొట్టారు. అలాగే బంగారు ఆభరణాలను ఎక్కడ దాచిందో చెప్పాలంటూ బ్లేడ్‌తో ఆమె శరీరంపై గాట్లు పెట్టారు. ఆ మహిళ అరుపులు బయటకు వినిపించకుండా పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ను ప్లే చేశారు. అయితే ఆ దంపతుల చిత్రహింసలను తట్టుకోలేక సమీనా చనిపోయింది. దీంతో భయపడిన హీనా, రమేష్ మ్యూజిక్‌ను ఆఫ్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు, గత రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి ఆగకుండా పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వస్తుండటంతో పొరుగున ఉన్న వారు అనుమానం వ్యక్తం చేశారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. బంధువుల చిత్ర హింసలకు తాళలేక చనిపోయిన సమీనా మృతదేహాన్ని గుర్తించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హీనా, రమేష్ దంపతుల కోసం వెతుకున్నారు.