న్యూఢిల్లీ: భర్తతో చెల్లికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అక్క అనుమానించింది. ఈ నేపథ్యంలో ఆమెపై గన్తో కాల్పులు జరిపింది (Woman Shoots Sister). దీంతో పోలీసులు అక్కను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 20 ఏండ్ల సుమైల, తన అక్క 30 ఏండ్ల సోనూతో కలిసి ఉంటున్నది. అయితే తన భర్త, సోదరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు సోనూ అనుమానించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సోనూ, చెల్లెలు సుమైల ముఖంపై గన్తో పలుమార్లు కొట్టింది. అలాగే ఆమెపై కాల్పులు కూడా జరిపింది.
కాగా, సోనూ బారి నుంచి తప్పించుకున్న సుమైల, స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తనపై కాల్పులు జరిపి హత్య చేసేందుకు అక్క ప్రయత్నించినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు సోనూను అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతోపాటు ఆయుధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.