పాలమూరుపై రేవంత్ పగ.. కాంగ్రెస్ పాలనలో వెయ్యేండ్ల విధ్వంసం
‘తన తల్లి మరణిస్తే కర్మకాండలకు నెత్తిన నీళ్లు చల్లుకొనేందుకు కరెంటు లేదు.. నీళ్లు లేవు అని నాడు నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎద్దేవా చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌పై నెపంనెట్టి తూలనాడుతున్నారు..’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
- కేసీఆర్ హయాంలో పచ్చబడ్డ పాలమూరు
- పడావుపెట్టి గొంతుకోస్తున్న రేవంత్‌రెడ్డి
- పంటలేయొద్దన్న మొదటి సీఎం ఈయనే
- సీఎం కుర్చీ గౌరవాన్ని మంటగల్పుతున్నడు
- కేసీఆర్ చేసిన ప్రగతితో వెర్రెత్తిన రేవంత్
- దిక్కుతోచకే ప్రతిచోటా అదే తిట్ల దండకం
- ధ్వజమెత్తిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఉమ్మడి పాలమూరుకు రేవంత్ తీరని ద్రోహం : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్ చేసిన పనులు కనిపిస్తూ వెక్కిరిస్తున్నయ్. అందుకే దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కేటీఆర్ స్మరణ చేస్తూ రేవంత్ తిట్ల దండకం అందుకుంటున్నడు. ముఖ్యమంత్రిగా 35 నెలల్లో పాలమూరుకు పిడికెడు పనులైనా చేశావా రేవంత్? నీ పాలనలో జిల్లా ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంది? కనీసం అదనంగా ఒక ఎకరాకు అయినా సాగునీళ్లు ఇచ్చినవా?
-మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘తన తల్లి మరణిస్తే కర్మకాండలకు నెత్తిన నీళ్లు చల్లుకొనేందుకు కరెంటు లేదు.. నీళ్లు లేవు అని నాడు నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎద్దేవా చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌పై నెపంనెట్టి తూలనాడుతున్నారు..’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సమైక్య రాష్ట్రంలో పాలమూరును కలుపకుంటే అప్పర్ కృష్ణా, భీమ, ఆర్డీఎస్, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా 1960 నాటికే జిల్లాలో 20 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరందేది. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసి నిజాంకాలం నాటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పాలకులు పక్కనబెట్టి జిల్లా ప్రజల గొంతుకోశార’ని దయ్యబట్టారు.
మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరుకు కాంగ్రెస్ వెయ్యేండ్ల విధ్వంసం చేసి మూడు తరాలను కోలుకోకుండా చేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సాగుకు సమృద్ధిగా నీరందించడంతో పాలమూరు జిల్లా పచ్చబడిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు సృష్టించిన అడ్డంకులను అధిగమించి రూ.35 వేల కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% కేసీఆర్ హయాంలోనే పూర్తిచేశామని చెప్పారు. మిగిలిన 10% పనులను కూడా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తే పాలమూరు ముఖచిత్రం మారిపోతుందని వ్యాఖ్యానించారు. పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్‌రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.
సీఎం సీటు గౌరవాన్ని మంటగలుపుతున్న రేవంత్
ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటుచేసిన వేదికలపై పుట్టినరోజులు చేసుకోవడం సిగ్గుచేటని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రతిపక్ష నేతపై, నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. చిల్లర భాష, మిడిమిడి జ్ఞానంతో సీఎం సీటుకున్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన తిప్పడు తిరునాళ్లకు పోయిండు.. రానే వచ్చిండు అన్నట్లున్నదని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గానికి వెళ్లడంలో ప్రత్యేకత ఏంది? కొడంగల్ పర్యటనకు పాలమూరుకు ఏం సంబంధం? మిగిలిన 13 నియోజకవర్గాలకు చేసింది ఏందని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధితోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకు లక్ష ఎకరాల చొప్పున నీళ్లు ఇవ్వాలన్న సంకల్పంతో పనిచేసి సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు.
దిక్కుతోచకే తిట్ల దండకం
రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్ చేసిన పనులు కనిపిస్తూ వెక్కిరిస్తున్నాయని, దీంతో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కేటీఆర్ స్మరణ చేస్తూ తిట్ల దండకం అందుకుంటున్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 35 నెలల్లో పాలమూరుకు పిడికెడు పనులైనా చేశావా? జిల్లా ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంది? కనీసం అదనంగా ఒక ఎకరాకు అయినా సాగునీళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు వచ్చాయని కనీసం ఇప్పుడైనా కండ్లు తెరిచి నీరందించాలని డిమాండ్ చేశారు. తాగునీటి కోసం జూరాల నుంచి వినియోగించేది 1.20 టీఎంసీలేనని స్పష్టంచేశారు. కానీ రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని తూర్పారబట్టారు.
కర్ణాటక నుంచి చుక్కనీరు దిక్కులేదు
కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చి పొలాలు తడుపుతామని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్ని టీఎంసీలు తీసుకొచ్చారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘నెలదాటినా కర్ణాటక చుక్కనీరు వదిలింది లేదు.. పాలమూరులో ఎకరా పారిందిలేదు.. కర్ణాటక నుంచి నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కనీసం ఒక లేఖ కూడా రాయలేదు. వచ్చిన నీళ్లను ఎలా వినియోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, చిత్తశుద్ధి లేద’ని విమర్శించారు. జూరాల దిగువకు ఈ ఏడాది 245 టీఎంసీలు నీళ్లు వచ్చాయని అధికారిక లెకలు చెప్తున్నాయి. ఇందులో శ్రీశైలం నుంచి అధికారికంగా 75 టీఎంసీలు, అనధికారికంగా 20 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందని చెప్పారు.. 45 రోజులుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు నడిపితే నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు నింపుకొనే అవకాశం ఉండేదని, దాంతో భూగర్భజలాలు పెరిగేవని చెప్పారు. కేవలం మూడు వంతెనల వద్ద మట్టి తీస్తే సాగునీరు తరలించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం చెబితే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌పై ఈర్ష్యపడేది రాజగోపాల్‌రెడ్డే
కొడంగల్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఈర్ష్య పడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరంజన్‌రెడ్డి తిప్పికొట్టారు. నిధులు ఇస్తే స్వాగతిస్తామని, కానీ మూడేండ్లో పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ఆయన పుట్టినగడ్డకు ఏంచేశారో చెప్పాలని హితవు పలికారు. పాలమూరుకు నిధులిచ్చినా..నీళ్లిచ్చినా ఈర్ష్యపడేది బీఆర్ఎస్ నేతలు కాదని, కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఉత్తమో, రాజగోపాల్‌రెడ్డి మాత్రమేనని చురకలంటించారు. ఇప్పటికైనా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
నీ అభివృద్ధికి కేటీఆర్ గడ్డం అడ్డొచ్చిందా?
ముఖ్యమంత్రి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి పాలనను పక్కనబెట్టి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ నీకు పోటీనే కానప్పుడు ప్రతిరోజూ వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తి గడ్డం, మీసాల గురించి మాట్లాడుతడా? కేటీఆర్ గడ్డాలు, మీసాలు రేవంత్‌రెడ్డికి చేసిన అభివృద్ధికి అడ్డంవచ్చాయా ? దేశంలో గడ్డం పెంచుకున్నది మొదట రేవంత్ రెడ్డేనా? గడ్డం పెంచుకున్న వారిలో పోటీకి పెడితే రేవంత్‌రెడ్డీ.. అందాల పోటీకి వచ్చినవా ? వ్యక్తిగత ఆహార్యం గురించి దిగజారుడు స్థాయి ఏందని ప్రశ్నించారు.
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి ప్రజల్లో అంత అభిమానం ఉంటే పది నియోజకవర్గాల నుంచి ప్రజలను ఎందుకు తరలించుకు తీసుకుపోయారని నిలదీశారు. మహిళా సంఘాలను, రైతులను అధికారులకు టార్గెట్లు పెట్టి తరలించింది వాస్తవం కాదా ? అని నిలదీశారు. ఈ సభతో కొడంగల్ ప్రజలకు జరిగిన తక్షణ లాభం ఏందని ప్రశ్నించారు. కొడంగల్‌లో పనులు చేస్తున్నదంతా ఆంధ్రా కాంట్రాక్టర్లేనని విమర్శించారు. కొడంగల్‌లో రైతుసభ పెట్టి ఎండిన పంటలకు ఏమిస్తరో ఎందుకు చెప్పలేదు? యాసంగి రైతుబంధు గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎల్ నినోతో 24.40 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే చెప్తున్నదని, నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పరిహారం ఇస్తుందో, ఇవ్వదో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పంటలు దెబ్బతింటే ఎకరాకు రూ.10 వేలు అందజేశామని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

