లక్నో: తన కూతురుతో యువకుడికి సంబంధం ఉందని ఆమె తల్లి అనుమానించింది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ వ్యక్తి, అతడి తల్లిపై గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. (Woman, Sons Kills Man) ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కజూ గ్రామానికి చెందిన 50 ఏళ్ల శాంతి దేవి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. పొరుగున నివసించే 20 ఏళ్ల సర్వజీత్ దివాకర్, తన కుమార్తె మధ్య ప్రేమ సంబంధం ఉందని అనుమానించింది. మార్చి 10న రాత్రి వేళ సర్వజీత్, అతడి తల్లైన 49 ఏళ్ల సంగీతపై శాంతి దేవి, 20 ఏళ్ల వయస్సున్న ఆమె ఇద్దరు కుమారులు శాని, శ్రావణ్ కలిసి గొడ్డలితో దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సర్వజీత్, సంగీతను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. శ్రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శాంతి దేవి, ఆమె మరో కుమారుడు శాని అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.